జగన్ ఆహానికి, దురాలోచనాలకు స్వయంగా ఆయన, వైసీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు బలయ్యారు. కేసీఆర్ విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఇదేవిదంగా ట్రంప్, పుతిన్‌ల ఆహానికి ఆయా దేశాలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు మూల్యం చెల్లిస్తున్నాయి కదా?
కనుక రాజకీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు వైఖరి సరిగా ఉండటం చాలా అవసరమని అర్దమవుతోంది.
కేసీఆర్ అహంకారం వల్లనైతేనేమి, తన రాజకీయాల కోసమైతేనేమి అటు కేంద్రంతో, ఇటు పొరుగు రాష్ట్రం ఏపీతో గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు, యావత్ తెలంగాణ ప్రజలు ఆయన నాయకత్వంలో నడిచారు.
కానీ కేసీఆర్ వైఖరి నచ్చక ఆయన వెంట నడిచిన తెలంగాణ ప్రజలే ఆయనని గద్దె దించేశారు. పదేళ్ళలో కేసీఆర్ మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ పోగేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే, ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోడీపై కత్తులు దూస్తున్నారు.
నిన్న ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాట్లాడుతూ, “మోడీజీ! బీసీ రిజర్వేషన్స్ ఇస్తారా లేదా మిమ్మల్ని గద్దె దించమంటారా?” అంటూ సవాలు విసిరారు.
బీసీ రిజర్వేషన్స్ అంశంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఈవిదంగా మాట్లాడటం రాజకీయంగా తప్పటడుగే అని చెప్పక తప్పదు. కేసీఆర్ ఈవిదంగా ప్రగల్భాలు పలికినందుకే మూల్యం చెల్లించారు కదా?
ఢిల్లీలో ధర్నా చేసి ప్రధానికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయాలని అడిగితే కేంద్రం ఇస్తుందా?అంటే కాదనే చెప్పవచ్చు.
ఇవ్వకపోతే ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’ అని చెప్పుకొని కాంగ్రెస్ రాజకీయ లబ్ది పొందగలదు. కానీ తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజలే కదా భరించాలి?
జగన్ సిఎంగా ఉన్నప్పుడు కేసులు, అప్పుల కోసం ఢిల్లీ పెద్దల పట్ల విధేయంగా ఉండేవారు. తద్వారా అయన తన తన రాజకీయ అవసరాలు, సమస్యలు తీర్చుకోగలిగారు. కానీ ఆయన వైఖరి కారణంగా ఏపీ నష్టపోయింది కదా?
చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు మోడీ, అమిత్ షాలపై కత్తులు దూశారు. కానీ దాని వలన నష్టమే తప్ప లాభం ఉండదని అనుభవపూర్వకంగా గ్రహించిన తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు.
అయన ఓ మెట్టు దిగడం వలన ఆయనతో పాటు టీడీపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు కలుగుతోంది కదా? కనుక ఈ విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడి వైఖరి సరైనదని స్పష్టమవుతోంది.
అంటే దీనర్ధం దేశంలో అన్ని పార్టీలు మోడీ, అమిత్ షాలకు విధేయంగా ఉండాలని కాదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈవిదంగా సయోధ్య పాటించడం చాలా అవసరం. రేపు మోడీ స్థానంలో మరొకరు ప్రధాని అయినా వారితో కూడా సయోధ్య పాటించడం చాలా అవసరమే కదా?




