ఆర్పీ పట్నాయక్ పతాక స్థాయిలో ఉన్నపుడు పాటల రచయితగా కులశేఖర్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. సెలబ్రిటీగా మారిన కులశేఖర్ ఫోటోలు ఇటీవల విడుదలైతే అందరూ చూసి షాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి పరిస్థితి ఇంకా దిగజారడం విశేషం. తాజాగా మరోసారి పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు.
[m9ad]
ఇంతకీ… నాటి సెలబ్రిటీ కాస్త నేడు కటకటాల వెనుక ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే… అప్పుడే సినీ ఫక్కీలో ఓ రివేంజ్ స్టోరీ బయటకు వచ్చింది. తాను రాసిన ఓ పాటను బ్రాహ్మణ వర్గం అభ్యంతరాలు తెలుపుతూ, అతనిని దూరంగా పెట్టడంతో కక్ష పెంచుకున్న కులశేఖర్, నాటి నుండి ఆలయాలను, పూజారులను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.
గతంలో కాకినాడ ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపాన్ని చోరీ చేసిన కేసులో రాజమండ్రిలో ఆరు నెలల పాటు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కులశేఖర్, తాజాగా ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచిని దొంగిలించాడు. ఆదివారం నాడు శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కులశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటకు వచ్చింది.
అరెస్ట్ చేసిన సమయంలో కులశేఖర్ నుండి 50 వేలు విలువ గల పది మొబైల్ ఫోన్లను, అలాగే దాదాపుగా 45 వేలు విలువైన పూజారుల చేతి సంచులను, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను, తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఒక సెలబ్రిటీ హోదాను సరిగా వినియోగించుకోలేకపోతే, ఏమవుతుందో అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం కులశేఖర్ స్టోరీనే అని చెప్పుకునే విధంగా ఉంది.



