కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడిందన్నట్లు మారింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసు. ప్రభుత్వాలు మారినప్పుడు ఫైల్స్ ఊరికే తగులబడిపోవు. వాటి వెనుక ఏదో పెద్ద కధ ఉంటుంది.
కనుక కాలి బూడిదైన మదనపల్లి ఫైల్స్‌లో ఏముందో తెలుసుకునేందుకు సీఐడీ పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే కొత్తగా మద్యం కుంభకోణం బయటపడటం విశేషం. కనుక ఎవరు ఏ ఉద్దేశ్యంతో వాటిని తగులబెట్టినా ఆ సమస్య నుంచి బయటపడలేకపోగా మరో కొత్త సమస్యని స్వయంగా సృష్టించుకున్నట్లయింది.
ఈ ఫైల్స్ దహనం వ్యవహారం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బినామీ భూముల వ్యవహారం ఉందని అనుమానిస్తున్న సీఐడీ పోలీసులు, ఆయన ప్రధాన అనుచరులు శశికాంత్, మాధవరెడ్డి ఇళ్ళలో ఆదివారం తనికీలు చేసినప్పుడు, వైసీపి ఎంపీ మిథున్ రెడ్డికి సంబందించిన మద్యం కుంభకోణంకి సంబందించి కొన్ని పత్రాలు, బ్యాంక్ లావాదేవీలకు సంబందించి కొన్ని చెక్కులు, డాక్యుమెంట్లు, సేల్ డీడ్స్ వగైరా లభించాయి. వాటిని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మిధున్ రెడ్డి అధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని సెంతేనీ బయో ప్రొడక్ట్స్, నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ రెండు డిస్టీలరీలలో భారీగా మద్యం తయారయ్యేది. జగన్ అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలుచేస్తామని చెపుతూ రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నిటినీ గుప్పెట్లోకి తీసుకున్నారు. అయితే మద్యానిషేధం కోసం కాదని వైసీపి నేతలకు భారీగా లబ్ధి కలిగించేందుకేనని చంద్రబాబు నాయుడుతో సహ టిడిపి నేతలు అప్పుడే ఆరోపిస్తుండేవారు. చివరికి వారి ఆరోపణలే నిజమని తేలింది.
వైసీపి నేతలకు లబ్ధి కలిగేలా చేసేందుకే ఆంధ్రప్రదేశ్ బెవరెజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి (ప్రస్తుతం పరారీలో ఉన్నారు), స్పెషల్ ఆఫీసర్‌గా సత్యప్రసాద్‌ని నియమించారు.
2019 అక్టోబర్ నుంచి 2021 నవంబర్ వరకు 25 నెలల్లో ఒక్క ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ నుంచే సుమారు రూ.1,863 కోట్లు విలువైన మద్యాన్ని ఏపీ బెవరెజస్ కార్పొరేషన్ కొనుగోలు చేయగా, రెండు కంపెనీల నుంచి 5ఏళ్లలో సుమారు రూ.6,000 కోట్లకు పైగా మద్యం కొనుగోలు చేసింది. అంటే జగన్ అధికారంలోకి రాగానే ఈ మద్యం వ్యాపపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన్నట్లు స్పష్టమవుతోంది.
అయితే ఈ కుంభకోణంపై సీఐడీ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించక మునుపే మదనపల్లి ఫైల్స్ దహనం కేసు దర్యాప్తులో మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు లభించడం విశేషం.




