కెరీర్ లో ఒక్కొక్కరికి కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. అయితే ఓ సంఖ్య విషయానికి వచ్చేపాటికి అది సెంటిమెంటల్ గా మారిపోతుంది. ప్రస్తుతం ఆ కోవలోనే ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నాడు. కెరీర్ లో ప్రిన్స్ చేస్తోన్న 25వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు – అశ్వనీదత్ లు నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో 25వ సినిమా హీరోలకు ఏ మాత్రం కలిసి రాకపోవడం, ప్రిన్స్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోన్న అంశం.
అవును… ఈ ఏడాది పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” నుండి నితిన్ “చల్ మోహన్ రంగా” అండ్ లేటెస్ట్ గా గోపిచంద్ “పంతం” వరకు 25వ సినిమా ఫ్యాన్స్ కు తీవ్ర నిరుత్సాహాన్ని మిగిలిస్తోంది. 25వ సినిమా అనే పాటికి మీడియాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పబ్లిసిటీ చేస్తుండడంతో, ప్రేస్తేజియస్ మూవీగా ప్రేక్షకుల ఆసక్తిని రాబడుతోంది. కానీ ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. నేడు విడుదలైన గోపీచంద్ “పంతం” కూడా ఇందుకు విరుద్ధం కాదని ఫస్ట్ డే రిపోర్ట్స్ చెప్తున్నాయి.
తదుపరి జాబితాలో మహేష్ ఉండడంతో ఒత్తిడి అంతా ప్రిన్స్ పైనే పడుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తొలిసారి నటిస్తుండడం… సబ్జెక్టు కొత్తదనంతో కూడుకుని ఉంటుందన్న ప్రచారం జరగడం… ఈ 25వ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలపడం మహేష్ కు కత్తి మీద సామేనని చెప్పవచ్చు. ఇప్పటివరకు విడుదలైన హీరోలలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” మాత్రమే 25వ సినిమాగా బాక్సాఫీస్ వద్ద ‘యావరేజ్’ మార్కులు వేయించుకుని, అంతకుమించిన కీర్తిప్రతిష్టతలను పొందింది.



