మొఘలుల కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగేవి. కాలం మారింది. పాలకులు మారారు. కానీ నేటికీ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాలలో అపచారాలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇతర మతాల గురించి మాట్లాడేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు హిందూమతం గురించి మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా చులకనగా మాట్లాడటం కనిపిస్తుంది. కోట్లాది మంది విశ్వసించే దేవతలు, పురాణాలు, ఇతిహాసాల గురించి కూడా వ్యంగ్యంగా, చులకనగా మాట్లాడేవారు నిత్యం కనిపిస్తూనే ఉన్నారు.
హిందూమతాన్ని విమర్శించడమే లౌకికవాదమనే భావన సమాజంలో బలపడింది. అదే సమయంలో హిందూమతం గురించి మాట్లాడితే మతతత్వం లేదా రాజకీయ ముద్ర పడుతుంటుంది. ఈ కారణంగా హిందూమతంలో నుంచే కుహనా లౌకికవాదులు పుట్టుకొస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు అందరికీ హిందూమతమే టార్గెట్ ఎందువాళ్ళ? ఇతర మతాల విషయంలో పాటించే సంయమనం హిందూమతం విషయంలో ఎందుకు కనిపించడం లేదు? అని ఆలోచిస్తే దీనికి సమాధానం హిందూమత స్వభావంలోనే కనిపిస్తుంది.
హిందూమతం కేవలం ఒక మతం కాదు. అది కోట్లాది మంది జీవన విధానం. సముద్రంలో నదులు కలుస్తాయి కానీ, సముద్రం వెళ్ళి నదుల్లో కలవదు. అలాగే మహాసాగరం వంటి హిందూమతం ఎన్నడూ మత మార్పిడులను ప్రోత్సహించదు. వచ్చిన వారిని తిరస్కరించదు. వద్దనుకొని వెళ్ళిపోయేవారిని అడ్డుకోదు.
హిందూమతం హిందువులకే పరిమితమైందని కాదు. లోకకల్యాణం, విశ్వశాంతిని కోరుకుంటుంది. మతం పేరుతో ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి కానీ మతం పేరుతో యుద్ధాలని హిందూమతం ఎన్నడూ ప్రోత్సహించలేదు. రామాయణ, మహాభారతంలో జరిగిన యుద్ధాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసమే తప్ప, మత విస్తరణ కోసం జరిగినవి కావు.
నది దగ్గరకు ఏ పాత్రతో వెళితే అంత నీరు తెచ్చుకోగలిగినట్లే, హిందూమతాన్ని కూడా ఎవరి అవగాహన, అధ్యయనం, అనుభవాన్ని బట్టి అంతవరకే అర్థం చేసుకోగలరు. కానీ యుగయుగాలుగా దాని సారాన్ని తెలుసుకోవడానికి అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అయితే మిడిమిడి జ్ఞానంతో హిందూమతం గురించి చులకనగా మాట్లాడేవారే ఎక్కువున్నారు.
వందల కోట్ల హిందువులు ఉన్న భారత దేశంలో హిందూమతంపై విమర్శలు, వివాదాలు, దాడులు జరుగుతున్నప్పటికీ స్పందించేవారు తక్కువే. ఎందువల్లనంటే లౌకికవాదం బలంగా నిలిచినందునే. దానికి వ్యతిరేకంగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే మౌనంగా ఉండటమే మంచిదనే హిందువుల భావన కూడా హిందూమతం అంటే చాలా మందికి చులకనగా కనిపించేలా చేస్తోంది. అందుకే హిందూమతం చాలా మందికి ఒక ‘పంచింగ్ బ్యాగ్’గా మారిందని చెప్పక తప్పదు.




