(గమనిక : ఇది ఎవరినీ తక్కువ చేయడానికో, ‘భరత్ అనే నేను’ సినిమాను విమర్శించడానికో చేసింది కాదు, కోడిగుడ్డుపైన ఈకలు పీకే ఉద్దేశం అసలే కాదు. అసెంబ్లీ సీన్ లో మహేష్ చెప్పినట్లు… ‘ప్రజలు మనల్ని గెలిపించింది వాళ్ళకు మంచి చేయడానికి తప్ప, వాళ్ళు తప్పు చేస్తే సమర్ధించడానికి కాదు’ అన్న తరహాలోనే దీనిని అందిస్తున్నాం. ఉదాహరణకు “తప్పు చేసే స్నేహితుడిని చూస్తూ మౌనంగా ఉండడం కన్నా, ఆ తప్పును ఎత్తి చూపే వాడే నిజమైన స్నేహితుడు” అన్న రీతిలో దీనిని ప్రచురించడమైనది.)
కొరటాల శివ దర్శకత్వం వహించిన “భరత్ అనే నేను” సినిమా బ్రహ్మాండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సబ్జెక్ట్ ను అందించినందుకు నిజంగానే కొరటాల శివను, ఒప్పుకున్నందుకు మహేష్ బాబును అభినందించాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వారిద్దరూ ‘భరత్ అనే నేను’ ద్వారా వాళ్ళ కెరీర్ లో అత్యుత్తమైన ప్రదర్శను ఇచ్చారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయే ఓ క్లాసిక్ ను ఇచ్చారా? అంటే ఖచ్చితంగా కాదనే సమాధానమే వెలువడుతుంది.
ముందుగా మహేష్ విషయానికి వస్తే… ‘శ్రీమంతుడు’ సినిమాకు ముందు వరకు ఒక సినిమాలో చేసిన యాక్టింగ్ మరో సినిమాలో ప్రదర్శించకుండా వైవిధ్యం చూపిస్తూ అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ ‘శ్రీమంతుడు’ నుండి ‘భరత్ అనే నేను’ వరకు అంతా ఒకే తరహా యాక్టింగ్ ను ప్రదర్శించడం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు, అభిమానులకు నిరుత్సాహపరిచే విషయమే! సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి పర్లేదు గానీ, లేదంటే ఈ పాటికి మహేష్ పై విమర్శల సునామీ వచ్చి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు.
ఇక కొరటాల విషయానికి వస్తే… చేసిన 4 సినిమాలలో ‘శ్రీమంతుడు’ బెస్ట్ స్క్రిప్ట్. కానీ దానిని అధిగమించడం పక్కన పెడితే, ఆ స్క్రిప్ట్ అందించినంత పకడ్బందీగా మరో స్క్రిప్ట్ ను అందించలేకపోతున్నారు. ‘జనతా గ్యారేజ్’ ద్వారా కాస్త డౌన్ అయితే, స్క్రిప్ట్ పరంగా ‘భరత్ అనే నేను’ ద్వారా ఇంకాస్త డౌన్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో “లాజిక్స్”కు అందని సన్నివేశాలకు కొదవలేదు.
ఒక ముఖ్యమంత్రి ఫైట్ ఎలా చేయగలడు? లండన్ నుండి వచ్చిన వ్యక్తి తెలుగు ఎలా మాట్లాడగలడు? అనే వాటికి అద్భుతమైన లాజిక్స్ ను పెట్టిన కొరటాల, మిగతా చాలా సన్నివేశాలలో ఆ ‘లాజిక్స్’ను పూర్తిగా మరిచారని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా…
1) ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి ముందుగా ఎమ్మెల్యేల బలం సరిపోయినా, కనీసం ఆ వ్యక్తి ఒక ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, ఎమ్మెల్సీ గానీ అయి ఉండాలి. లేదంటే కనీసం ఆరు నెలల సమయం లోపున ఎన్నికలలో గెలిచి ఉండాలి. మరి మహేష్ బాబు ఏకంగా 8 నెలల 13 రోజులు పాలించినా ఎక్కడా ఎన్నికల హడావుడి లేదు.
2) ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్నారని, దానిని పత్రికలు అసభ్యకరంగా చిత్రీకరిస్తే ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అనేది జీర్ణించుకోలేని అంశం. బహుశా అలా చేసాడంటే… ఆ సిఎం మానసిక స్తైర్యం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అంత సెన్సిటివ్ వ్యక్తి సిఎంగా పనికిరాడు. అలా చేసిన ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం అలా చేసిన ఎంపీటీసీలు కూడా దొరకరు, అలా చేయరు కూడా!
3) ముఖ్యమంత్రిగా మహేష్ చాలా నిర్ణయాలు తీసుకుంటాడు. ట్రాఫిక్, విద్య, కాంట్రాక్టర్, స్వపరిపాలన… ఇలా అనేక అద్భుతమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ అవేమీ మచ్చుకు కూడా తెరమీద కనిపించవు, కేవలం డైలాగ్స్ తప్ప! అలా ‘చిటికేస్తే’ అయిపోయాయని ఊహించుకోవాలేమో! ఉన్నంతలో విద్యకు మాత్రం ఓ పిల్లాడి చేత నాలుగు ఇంగ్లీష్ ముక్కలు పలికించి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ చెప్తున్నారన్న భావాన్ని ప్రేక్షకులకు తెలియజేసారు.
4) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విషయాలలో మొదటిది కొంత పర్లేదు (ముందు సీన్ లో కనీసం మహేష్ ఎక్స్ ప్రెషన్స్ అయినా చూపించారు) గానీ, ప్రకాష్ రాజ్ ప్రమాణ స్వీకారం చేయడం, రెండోసారి మహేష్ ప్రమాణం చేయడం అనేది ‘సినిమాటిక్’ అని సరిపెట్టుకోవాలేమో!
5) తమ్ముడి క్యారెక్టర్ ను ఎందుకు పెట్టారో కొరటాలకే తెలియాలి. బహుశా శరత్ కుమార్ కు తలకొరివి పెట్టారన్న డైలాగ్ కోసం ఈ తమ్ముడి క్యారెక్టర్ పుట్టిందేమో! సినిమాలో తమ్ముడు పలికిన ఏకైక డైలాగ్ ‘వెళ్లొద్దు’తో ఆ క్యారెక్టర్ అలా ముగిసిపోతుంది. మహేష్ పలికే నాలుగు ఇంగ్లీష్ డైలాగ్స్ తో మెచ్యూరిటీ వచ్చే వ్యక్తి అన్నాళ్ళుగా ఎలా మాట్లాడకుండా ఉంటాడో?!
6) అసెంబ్లీ సన్నివేశాలలో స్పీకర్ అలా చెప్తే, ఇలా సభ్యులందరూ కూర్చోవడం మరింత శోచనీయం. అసెంబ్లీలో కావల్సినంత డ్రామాకు అవకాశం ఉన్నా, ముఖ్యమంత్రి ఒక్క పాయింట్ మీద తాను చెప్పాల్సిందంతా చెప్పి, బయటకు వెళ్ళిపోవడానికి స్పీకర్ అనుమతి కోరడం లాజిక్ లేని సన్నివేశాలలో మరొకటి.
ఇలా చెప్పుకుంటూ వెళితే లాజిక్ లెస్ సీన్స్ బోలెడు. ఇక క్లైమాక్స్ లో కొరటాల మరోసారి తన వీక్ నెస్ ను చాటుకున్నారు. ‘పోకిరి’ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఏకైక కారణం క్లైమాక్స్.’ అంత బలమైన క్లైమాక్స్ లను కొరటాల ఇంత వీక్ గా ఎలా రాసుకుంటున్నారో అనేది అర్ధం కాని అంశం. క్లైమాక్స్ లో ఒక ఫైట్ పెడితే చాలనుకుంటున్నారో ఏమో గానీ, ‘శ్రీమంతుడు’ నుండి అదే ఫార్ములాను ఫాలో అవుతూ విమర్శల పాలవుతున్నారు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ వచ్చిందన్న ధోరణిలో రానూ రానూ సబ్జెక్ట్ లోని లోపాలను కొరటాల మిస్ అవుతున్నారు.
ఇక్కడే ఓ విషయాన్ని కూడా ప్రస్తావించాలి. మహేష్ అన్నట్లు ఈ సినిమాను రెండు పార్టులుగా తీసి ఉంటే… బహుశా ఈ కధకు, స్క్రిప్ట్ కు పూర్తి న్యాయం జరిగేదేమో! అప్పుడు లాజిక్ తో కూడిన సన్నివేశాలను పెట్టడానికి కొరటాలకు కూడా కొంత వెసులుబాటు కలిగి ఉండేదని చెప్పవచ్చు. ఇప్పటికే 3 గంటల సినిమా అయ్యింది, ఈ లాజిక్స్ ను కూడా పెడితే మరో గంట ఉండాలి, అందుకే పెట్టలేకపోయామని అనడం గానీ, సరిపెట్టుకోవడం గానీ కరెక్ట్ కాదు కదా..!



