అమరావతి నిర్మాణానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్ళు చూస్తున్నప్పుడు నాడు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది.
నాడు పార్టీలకు, రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. అయితే అది కేవలం తెలంగాణ ప్రజలకు సంబందించిన సమస్య మాత్రమే కాదు. ఆంధ్రా ప్రజల భవిష్యత్ కూడా దానితో ముడిపడి ఉంది. కనుక ఆంద్ర ప్రజలు రాష్ట్ర విభజనని వ్యతిరేకించారు.
అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఐకమత్యంతో, బలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం చాలా గొప్ప విషయమే కనుక నేటికీ వారు అందుకు గర్విస్తుంటారు.
తెలంగాణ ఏర్పాటులో కోట్ల మంది ఆంధ్రా ప్రజలకు భిన్నాభిప్రాయాలున్నాయి కనుక వ్యతిరేకించారు. కానీ రాజధాని అమరావతి విషయంలో ఆంధ్రా ప్రజలలో భిన్నాభిప్రాయాలు లేవు. అత్యధిక శాతం ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు.
అంతేకాదు రైతులు స్వచ్ఛందంగా వేల ఎకరాల భూములు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజకీయంగా చాలా బలంగా ఉంది. వచ్చే ఎన్నికలలోగా అమరావతిని మూడేళ్ళలో పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కానీ అమరావతికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తెలంగాణ సాధన కోసం ఆ రాష్ట్రంలో పేద ధనిక, హిందూ ముస్లిం, ఆడ మగ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంగా పోరాడి తే, ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డే రాష్ట్ర రాజధాని అమరావతికి అవరోధంగా నిలుస్తుండటం చాలా బాధాకరమే.
నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, నేడు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ద్వేషిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ అమరావతిని ఏపీకి రాజధానిగా ధృవీకరించినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం దానిని రాజధానిగా అంగీకరించడం లేదు. అంతే కాదు.. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ‘మావిగన్’ రాజధానిగా చేస్తానని చెప్తున్నారు.
రాజధాని విషయంలో ఆయన ధోరణి అమరావతికి, దానిని నిర్మిస్తున్న కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా మారింది.
కనుక నాడు తెలంగాణ కోసం ప్రజలు పోరాడితే ఇప్పుడు అమరావతిని నిర్మించేందుకు, దానినే రాజధానిగా నిలుపుకునేందుకు కూటమి ప్రభుత్వం అదే స్థాయిలో రాజకీయ పోరాటాలు చేయాల్సి వస్తోంది.
అమరావతి రాష్ట్ర భవిష్యత్‌ని సమూలంగా మార్చగలదని నమ్మి రైతులు తమ జీవనోపాధి అయిన భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. రాష్ట్ర రాజధాని కోసం ఓ మాజీ ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి, ప్రభుత్వం నిరంతరం రాజకీయ పోరాటాలు చేయాల్సి రావడం దౌర్భాగ్యమే… కదా?




