ఏప్రిల్ 27వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి అనేది పాత వార్త. సమయం దగ్గర పడే కొద్ది ఈ రెండు సినిమాలలో ఏదొకటి ముందుకు జరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది చెప్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉంది గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే పోటీ షురూ అయ్యింది.
ఈ ఇద్దరు హీరోలు కూడా ఇటీవల ‘ఇంస్టాగ్రామ్’ అనే సామాజిక మాధ్యమంలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత అల్లు అర్జున్ నవంబర్ 21వ తేదీన తన పాప పుట్టినరోజు సందర్భంగా ఎంట్రీ ఇవ్వగా, ఇప్పటివరకు 4.26 లక్షల మంది బన్నీ ఖాతాలో వచ్చిపడ్డారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే… ఓ వారం రోజుల క్రితమే ‘భరత్ అనే నేను’తో ఓపెన్ చేయగా, ఇప్పటికే 7.24 లక్షల మంది ప్రిన్స్ ఫాలోయర్స్ జాబితాలో చేరారు.
ఈ ఇద్దరి హీరోలను పరిశీలిస్తే… అల్లు అర్జున్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన సినిమాలకు సంబంధించి గానీ, ఫేమస్ క్వోటేషన్స్ గానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రిన్స్, కేవలం తన సినిమాలకు సంబంధించిన అంశాలనే, అది కూడా చాలా అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బన్నీ కంటే ఎక్కువ ఫాలోయర్స్ అతి తక్కువ వ్యవధిలో వేసుకుని, తనకున్న పాపులారిటీని చాటిచెప్పుకున్నాడు.
ప్రిన్స్ దూకుడు చూస్తుంటే, అతి కొద్ది రోజుల్లోనే 1 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకునేలా కనపడుతున్నాడు. మరో విశేషం ఏమిటంటే… అల్లు అర్జున్ వరుస సక్సెస్ లతో ఉంటూ 4.26 లక్షల ఫాలోయర్స్ ను సొంతం చేసుకోగా, రెండు ఫ్లాపులతో ఉన్న ప్రిన్స్ మాత్రమే ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సక్సెస్ తో అభిమానానికి సంబంధం లేదని మహేష్ బాబు ‘ఇంస్టాగ్రామ్’ మరోసారి నిరూపిస్తోంది.



