ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” షూటింగ్ లో పాల్గొంటున్న ప్రిన్స్ మహేష్ బాబుపై తాజాగా ఓ వార్త ట్రేడ్ వర్గాలలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. “ఫిదా” సినిమాతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల – మహేష్ బాబు కాంబో ప్రారంభం అయ్యే సూచనలు కనపడుతున్నట్లుగా ఈ వార్తల సారాంశం.
గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన “లీడర్” సినిమాకు సీక్వెల్ ను మహేష్ బాబుతో శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రానుందని గతంలో ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
నిజానికి ‘ఫిదా’ సినిమాతోనే వీరిద్దరి కాంభినేషన్ తెరపైకి రావాల్సి ఉంది. కానీ ఆ కధకు ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ, శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయాల్సి ఉందని గతంలో వివిధ ఇంటర్వ్యూలలో ప్రిన్స్ కూడా స్పష్టం చేసారు. అయితే ఆ తరుణం ప్రస్తుతం ఆసన్నమైందని, ‘లీడర్’ సినిమాకు సీక్వెల్ కధను రాసే పనిలో ఉన్నారని, ఇది మహేష్ తోనే తెరకెక్కనుందన్న వార్త ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది.


