ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్న “బ్రహ్మోత్సవం” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర నుండి అందరూ ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ‘బ్రహ్మోత్సవం’ కబుర్లు చెప్తున్నారు. అయితే తమ హీరో ఎలాంటి విశేషాలను చెప్తారా అని ఆశిస్తున్న అభిమానులకు ప్రిన్స్ మహేష్ బాబు, అసలు ‘బ్రహ్మోత్సవం’ తను హీరోనే కాదంటూ చెప్పి ఆశ్చర్యపరిచారు.
అవును… ‘బ్రహ్మోత్సవం’లో హీరో మహేష్ బాబు కాదంట. శ్రీకాంత్ అడ్డాల రాసిన కధలో కేవలం తను కూడా ఒక పాత్ర మాత్రమే పోషించానని తన పాత్రపై ఉన్న అంచనాలను కాస్త తగ్గించే ప్రయత్నం చేసారు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఇది త్రికోణ ప్రేమకధ కాదని చెప్పిన మహేష్, కధలో భాగంగా ముగ్గురు ఉన్నారే తప్ప, ప్రణీత ఒక కీలక పాత్ర పోషించిందని, నిజానికి ఈ పాత్ర ఒప్పుకున్నందుకు ప్రణీతను అభినందించాలని, కాజల్, సమంతలు ప్రధాన పాత్రలు పోషించారని ప్రిన్స్ స్పష్టం చేసారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మరిచిపోయిన కుటుంబ అనుబంధాలను, చిన్న చిన్న ఫీలింగ్స్ ను, ఏమోషన్స్ ను శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ గుర్తు చేస్తుందని, ఈ కధను నమ్మి ముందుకొచ్చిన నిర్మాత పివిపి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలని, ప్రస్తుతం చెన్నైలో ఉంటూ తమిళ వెర్షన్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తున్నారని నిర్మాతపై ప్రశంసలు కురిపించారు. ‘బ్రహ్మోత్సవం’ విజయం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని ప్రిన్స్ వ్యక్తపరిచిన నమ్మకం నిజం కావాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.



