‘శ్రీమంతుడు’ సినిమాకు ముందు ప్రేక్షకులకు కనిపించిన ప్రిన్స్ మహేష్ బాబు వేరు… ఆ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు కనిపిస్తున్న ప్రిన్స్ వేరు..! అవును… సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ప్రాముఖ్యమో ‘శ్రీమంతుడు’ సినిమాకు తెలుసుకున్న ప్రిన్స్, తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రముఖ జీ తెలుగు ఛానల్ ప్రసారం చేసే ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ కార్యక్రమంలో ప్రిన్స్ తన అనుభవాలు పంచుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆ కార్యక్రమ నిర్వాహకుడు, యాంకర్ ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసాడు. ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ మూడవ సీజన్ ను ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రారంభించబోతున్నట్లు… ప్రిన్స్ తో దిగిన ఓ సెల్ఫీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని చాటుకున్నాడు.
ఎప్పుడో సినిమాలు విడుదలైతే గానీ కనపడని ప్రిన్స్ ఇంటర్వ్యూల కోసం సహజంగానే కాచుకుని కూర్చునే ప్రిన్స్ అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాధారణంగా సెలబ్రిటీల చేత ప్రదీప్ చేయించే రచ్చ మామూలుగా ఉండదు. మరి ప్రిన్స్ కార్యక్రమం కూడా అలాంటి రచ్చ రంభోలాగానే సాగుతుందా… లేక సరికొత్తగా కార్యక్రమాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారో చూడాలి.



