“స్పైడర్” సినిమా ఫలితం తర్వాత మహేష్ బాబు కాస్త దూకుడును పెంచాడు. నిర్విరామంగా షూటింగ్స్ చేస్తుండడంతో పాటు, కొత్త సినిమాలను కూడా ఒప్పుకుంటున్నాడు. తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా, తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందా? అన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. క్యూలో సుకుమార్, త్రివిక్రమ్, బోయపాటి వంటి స్టార్ డైరెక్టర్లతో పాటు ‘వన్ మూవీ వండర్’గా మారిన సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు.
‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత జరిగిన పరిణామాలన్నీ సందీప్ రెడ్డిని అందరికంటే ముందు వరుసలో నిలుపగా, ఇటీవల కధ విన్న మహేష్ బాబు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటివరకు మహేష్ చేయనటువంటి క్యారెక్టర్… మెకానిక్ రోల్ లో కనిపించబోతున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం బలంగా వినపడుతోంది. వంశీ పైడిపల్లి సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుండడంతో, ఆ సినిమా విడుదల తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.



