హైదరాబాద్ నుండి తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం రాజమౌళి తదితరులు, రెండవ రౌండ్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఈ సారి నేరుగా మీడియా మీట్ కాదు, సోషల్ మీడియా ద్వారా తమ భావాలను పంచుకున్నారు.
తాడేపల్లిలో జగన్ వద్ద ఏం వ్యాఖ్యలైతే చేసారో వాటినే మళ్ళీ రిపీట్ చేస్తూ, చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసారు. ఆల్ రెడీ మీడియా ముఖంగా ఓ సారి చెప్పేసాక మళ్ళీ అవే వ్యాఖ్యలను ఎందుకు పోస్ట్ చేసారు? అంటే సోషల్ మీడియా ఫాలోయర్స్ కు కూడా తమ భావనను తెలియజేయాలని భావించారో ఏమో గానీ వరుసగా పోస్ట్ లు చేస్తున్నారు.
బహుశా నేడు జరిగిన చర్చలలో ఇది కూడా ఓ ఒప్పందంలో భాగం అనిపించేలా మహేష్, చిరు, జక్కన్నల ట్వీట్స్ ఉన్నాయి. మరోవైపు జగన్ కూడా తన రికార్డింగ్ వీడియోను విడుదల చేయగా, అందులో ‘ఓటీటీ’కి బదులుగా ‘ఓటీపీ’ అనడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జగన్ ప్రసంగంలో ఇలా ఏదోకటి వైరల్ కావడం సర్వసాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే.
తెలుగు సినిమా గత ఆరేడు నెలలుగా కష్టాల కడలిలో ఉండిపోయిందని స్వయంగా మహేష్, ప్రభాస్, రాజమౌళిలు వ్యక్తపరిచిన నేపథ్యంలో…. అసలు ఈ కష్ఠాలకు కారణం ఎవరు? నేడు పరిష్కారం చేస్తోంది ఎవరు? మీరంతా ఎవరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు? అన్న ప్రశ్నలను సోషల్ మీడియా జనులు భారీ స్థాయిలో వ్యక్తపరుస్తున్నారు.