రెండు రోజులు థియేటర్లను మూసివేయాలని కేరళ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం మల్లువుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. కొత్త సినిమాలను తక్కువ గ్యాప్ లో ఓటిటికి ఇవ్వడం పట్ల నిరసన ప్రకటిస్తూ ఈ చర్యకు దిగడం పట్ల నిర్మాతలు ఖంగారు పడుతున్నారు. ఇండస్ట్రీ హిట్ సాధించిన 2018 సోనీ లివ్ లో వస్తున్నందుకు నిరసనగా జూన్ 7,8 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
థియేటర్లకు జనాన్ని రప్పిస్తున్న బ్లాక్ బస్టర్లను సైతం ఇలా డిజిటల్ బాట పట్టించడం వాళ్ళ ఆగ్రహానికి కారణం. ఇది అంత సులభంగా పరిష్కారం దొరికే సమస్య కాదు. ఎందుకంటే నిర్మాతకూ థియేట్రికల్ రెవిన్యూ మీదే ఎక్కువ ప్రేమ, ఆశ ఉంటాయి. అదే సమయంలో కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా అంచనాలకు తగ్గట్టు ఆడుతుందో లేదో అనే సంశయం ఉంటుంది.
అందుకే నెల రోజులకే డిజిటల్ ప్రీమియర్లకు టెంప్ట్ అవుతున్న దాఖలాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది తప్పనలేం. ఎంత పెద్ద హిట్టయినా మహా అయితే నాలుగు వారాలకు మించి ఆడని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచమంతా పొగిడిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ శతదినోత్సవాలు జరుపుకోలేదు. అయినా వందలు వేల కోట్లు కొల్లగొట్టాయి. కాబట్టి ఓటిటిలు సినిమాను చంపేయడం లాంటి స్టేట్ మెంట్లకు పూర్తి మద్దతు ఇవ్వడం కష్టం.
కరోనా తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారడం ఈ పరిణామాలకు కారణం. శాటిలైట్ మార్కెట్ ఎలాగూ దీనావస్థలో ఉంది. ప్రొడ్యూసర్లు డబ్బింగ్, ఓటిటిల మీద మాత్రమే అదనపు ఆదాయం కోసం ఆధాపడుతున్నారు. దానికి తగ్గట్టే సదరు సంస్థలు ఇంత గ్యాప్ తో అయితేనే మంచి రేట్ ఇస్తామని మెలిక పెడుతున్నాయి. దీంతో నిర్మాతలు రాజీపడక తప్పడం లేదు. ఎలా చూసుకున్నా వీటికి అడ్డుకట్ట వేయడం సులభం కాదు.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
గత ఏడాది టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎనిమిది వారాల ఓటిటి నిబంధన తీసుకొచ్చింది. తీరా చూస్తే దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ ధర్నా, సమావేశం జరిగి తొమ్మిది నెలలు దాటేసింది. ఇక్కడ తప్పు ఎవరిదీ కాదు. అవసరానికి తగ్గట్టు పెట్టుబడులు రక్షించుకోవడం కోసం పడే తాపత్రయమే ఇదంతా. థియేటర్లు రెండు రోజులు కాదు నెల రోజులు మూసేసినా ప్రేక్షకులకు ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో నిక్షేపంగా పాత సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటారు. ఎటొచ్చి బయ్యర్లు, నిర్మాతలు దెబ్బ తింటారు. ఈ భేతాళ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే.