‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అన్నదమ్ములుగా నటించిన విక్టరీ వెంకటేష్ – ప్రిన్స్ మహేష్ బాబుల మధ్య అనుబంధం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘మాటలు తక్కువ – ఆప్యాయత ఎక్కువ’ అనే మాదిరి ఉన్న ఈ బాండింగ్, ఆ సినిమా పూర్తయిన తర్వాత నిజ జీవితంలో కూడా కొనసాగుతోంది. పలు ఆడియో వేడుకలపై మహేష్ ను ‘తమ్ముడు’ అంటూ వెంకీ పలకరించగా, ‘అన్నయ్య’ అంటూ ప్రిన్స్ సంభోదించడం కూడా విన్నదే.
అయితే మహేష్ ను విక్టరీ ఎంతలా విశ్వసిస్తున్నారో అనడానికి నిదర్శనంగా, ఉగాది నాడు బుల్లితెరపై సందడి చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చాటిచెప్పింది. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తోన్న ఈ కార్యక్రమంలో ఉగాది పండగ స్పెషల్ గా ‘గురు’ వెంకీ హాజరుకాగా, ఈ కార్యక్రమంలో గెలుచుకున్న మొత్తం సొమ్మును దేనికి వినియోగించదలుచుకున్నావు? అంటూ వెంకీని మెగాస్టార్ ప్రశ్నించారు. ఇక్కడే టాపిక్ లోకి ప్రిన్స్ ఎంటర్ అయ్యాడు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తన తమ్ముడు ఇటీవల ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని, అలాగే ఓ ట్రస్ట్ స్థాపించాడని, మహేష్ పై తనకు నమ్మకం ఉంది గనుక, ఈ కార్యక్రమంలో గెలుచుకున్న మొత్తం సొమ్మును మహేష్ ట్రస్ట్ కు విరాళంగా ఇస్తానని ప్రకటించడంతో అక్కడున్న వారితో పాటు మెగాస్టార్ కూడా చప్పట్లతో అభివాదాలు చేసారు. ఆ సినిమాలో మహేష్ జేబులో ఎప్పుడూ డబ్బులు పెడుతూ ఉండేవాడివి, ఇప్పుడు మహేష్ ట్రస్ట్ జేబులో పెడుతున్నావన్న మాట అంటూ మెగాస్టార్ గారు ఓ ఛలోక్తి విసిరారు.



