కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని నిరసిస్తూ గత నెల 24న అమలాపురంలో జరిగిన అల్లర్ల వెనుక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ మంత్రులు పదేపదే ఆరోపించారు. కానీ ఆ అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులు కూడా ఉన్నారు.
ఈ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మంత్రి విశ్వరూప్ అనుచరులైన సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులపై కూడా కేసు నమోదు చేసి నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 258 మంది నిందితులుగా పేర్కొని, వారిలో 142 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఏ-222గా పేర్కొనబడిన చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అమలాపురం పోలీసులు మంత్రి విశ్వరూప్ అనుచరులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలినవారి కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ అల్లర్లు జరగ్గానే వైసీపీ మంత్రులు ఒక్క క్షణం ఆలోచించకుండా వాటి వెనుక టిడిపి, జనసేనలున్నాయని ఆరోపించారు. అయితే మంత్రి విశ్వరూప్ అనుచరులు కూడా ఆ అల్లర్లలో పాల్గొన్నారని, పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే, వైసీపీలో ఎవరూ వారి గురించి మాట్లాడటం లేదు. ఇవాళ్ళ శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన ఓ సభలో కూడా ప్రతిపక్షాలే ఈ అల్లర్లకు కారణమని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
అయితే ఆ రోజు పార్టీలకు అతీతంగా అమలాపురంలో కొన్ని వర్గాల ప్రజలు భావోద్వేగంతో ర్యాలీ నిర్వహించినప్పుడు అవి అదుపుతప్పి విధ్వంసానికి దారితీశాయని అర్దమవుతూనే ఉంది. మంత్రి విశ్వరూప్ అనుచరులు కూడా ఆ అల్లర్లలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.



