మిస్ వరల్డ్-2025: ఇప్పుడేమంటారు కేటీఆర్‌?

Miss World 2025: KTR’s Silence Speaks?

ఈసారి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ పోటీలు మొదలయ్యే సమయంలోనే భారత్‌-పాక్‌ మద్య యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఈ పోటీల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది.

ADVERTISEMENT

భారత్‌-పాక్‌ దేశాల గగన తలాలపై పరస్పరం నిషేధం విధించుకోవడంతో అనేక అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ పోటీలలో పాల్గొనేందుకు 110 దేశాల నుంచి అందాల భామలు వస్తారా రారా?వచ్చినా పోటీలు జరుగుతాయా లేదా?అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఓ వైపు దేశంపై పాక్‌ దాడులు చేస్తుంటే, సరిహద్దుల వద్ద మన సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే అందాల పోటీలా సిగ్గు సిగ్గు. సిఎం రేవంత్ రెడ్డి చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు,” అంటూ కేటీఆర్‌ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

కానీ ప్రపంచ దేశాల సుందరీమణులు ఈ పోటీలలో పాల్గొనేందుకు నిర్భయంగా హైదరాబాద్‌ వచ్చారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్భయంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించింది.

మరో విశేషమేమిటంటే, యుద్ధ కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి కానీ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడలేదు!

అదృష్టవశాత్తు భారత్‌-పాక్‌ మద్య యుద్ధం మూడు రోజులలోనే ముగిసి, మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకి అంగీకరించడంతో మిస్ వరల్డ్ పోటీలకు అన్ని అవరోధాలు తొలగిపోయాయి.

అదే రోజున హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్-2025 ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ పోటీలకు వచ్చే సుందరీమణులతో తెలంగాణ, హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవచ్చని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం, అందుకు అనుగుణంగానే పలు కార్యక్రమాలు రూపొందించి చాలా చక్కగా అమలుచేసింది.

మే 7 నుంచి మే 22న ఈ అందాల పోటీలు మొదలయ్యే వరకు ప్రతీరోజూ హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ప్రముక పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ద ఆలయాలకు 110 దేశాల సుందరీ మణులను తీసుకువెళ్ళి తిప్పి చూపిస్తున్నారు.

దీని వలన తెలంగాణకు ఏం లాభం?అంటే ఆయా దేశాల సుందరీమణులు ఆయా ప్రాంతాలలో వారు దిగిన ఫోటోలతో పాటు తీసిన ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియా ఖాతాలలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటే కొన్ని కోట్లమంది వాటిని చూస్తున్నారు.

తెలంగాణ, హైదరాబాద్‌ అందాలు, సంస్కృతి సాంప్రదాయాలు, వాటిని ప్రతిభింబించే జానపద కళలు, నృత్యాలు, చీరలు, ఇతర దుస్తులు, ఆభరణాలు, ఆలయాలలో అద్భుతమైన శిల్పకళ వంటివన్నీ చూసి యావత్ ప్రపంచ దేశాల ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్‌ గ్లోబల్ ఇమేజ్ ర్యాంక్ అమాంతం పెరిగిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం చాలా తెలివిగా ఈ మిస్ వరల్డ్ పోటీలతో తమ రాష్ట్రానికి ప్రపంచ దేశాలలో ఉచిత ప్రచారం లభించేలా చేసుకుందని చెప్పవచ్చు. దీని వలన రాబోయే రోజుల్లో తెలంగాణకు విదేశీ పర్యాటకుల సంఖ్య తప్పక పెరుగుతుంది.

నేడు హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీలలో పాల్గొంటున్న సుందరీమణులు పలు క్రీడాపోటీలలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్-2025 పోటీలపై చవుకబారు విమర్శలు చేసిన కేటీఆర్‌ ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆయన మౌనమే ఈ పోటీల నిర్వహణ సరైనదని సూచిస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories