‘మా నమ్మకం నువ్వే జగనన్న’, జగన్ బొమ్మ చూసే మాకు ఓటేస్తారు, మాకు ఎవరితో పొత్తులు అవసరం లేదు, మాకు దుష్టచతుష్టయం మద్దతు లేదు, కేవలం మా ప్రభుత్వం చేసిన అభివృద్దే మా పెట్టుబడి అంటూ ఇన్నాళ్లు జగన్ భజనా కార్యక్రమాలను ప్రచారం చేసుకున్న వైకాపా నాయకులు ఇప్పుడు వాస్తవాలను బయటపెడుతున్నారు.
మా నమ్మకం మీరే అంటూ ‘వాలంటీర్ల భజన’ మొదలుపెట్టారు. నియోజకవర్గ ఇంచార్జ్ లను మారుస్తూ జగన్, టీడీపీ భాషలో చెప్పాలంటే అక్కడి చెత్తను ఇక్కడా, ఇక్కడి చెత్తను అక్కడికి తరలించే ప్రక్రియలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి సెంట్రల్ కు మార్చిన వెల్లంపల్లి స్థానిక వైసీపీ నేతల సహకారం ఎంత వరకు ఉంటుందో అన్న అనుమానంతో స్థానిక వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసారు.
ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్లు వైసీపీ విజయానికి సహకరించాలని, మా నమ్మకం మొత్తం మీ మీదే పెట్టాం అంటూ మనసులో మాట బయట పెట్టారు కొబ్బరి చిప్పల మంత్రిగా పాపులర్ అయిన మాజీ మంత్రి వెల్లంపల్లి.
అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత ప్రచారాలకు, ప్రయోజనాలకు వాలంటీర్లను కానీ సచివాలయ సిబ్బందిని కానీ వినియోగించరాదు అనే నిబంధన ఉంది. ఇటువంటి నిబంధలనను బేఖాతరు చేయడంలో వైసీపీ ప్రభుత్వం కానీ వైకాపా నాయకులు కానీ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు అనేది అక్షర సత్యం.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలి అంటూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా తుంగలో తొక్కిన ఈ ప్రభుత్వం ఇక వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో వాడుకోకూడదు అని పెట్టే షరతులకు ఏమాత్రం విలువనిస్తుందో ఇప్పుడు వెల్లంపల్లి నిరూపించారు. స్థానిక వాలంటీర్లను వెంటపెట్టుకుని గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు వెల్లంపల్లి.
దీనికి ప్రతిగా ప్రతి వాలంటీర్ కు 20 వేల రూపాయల నగదు, వంట సామాను వంటి తాయిలాలు ఆశ చూపి తన వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద అంత నమ్మకం ఉండి, మా విజయానికి ఒక్క జగన్ బొమ్మ చాలు అంటూ ప్రగల్బాలు పలికిన ఈ నేతలు ఇప్పుడు వాలంటీర్లతో కాళ్లబేరానికి రావడం అంటే ప్రజలు స్వచ్ఛందంగా, సంతృప్తిగా వచ్చి వైసీపీ కి ఓటువేయరని వెల్లంపల్లి నమ్ముతున్నారా..?భయపడుతున్నారా..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.






