తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకులలో లెజెండరీ మ్యూజిషియన్ గా పేరు గాంచిన ఎం.ఎం.కీరవాణి తన మనసు విప్పి సోషల్ మీడియా ముందు పెట్టారు. సినిమాల నుండి రిటైర్మెంట్ సంకేతాలు ప్రకటించిన కీరవాణి… ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బ్రెయిన్ లెస్’ దర్శకులు ఉన్నారంటూ మండిపడ్డారు. తనను రిటైర్ కావద్దంటూ 99 శాతం అంటున్నారని, అయితే తానూ కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఎందుకంటే టాలీవుడ్ లో ‘బ్రెయిన్ లెస్’ డైరెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇంకా తానూ కొనసాగాలంటే కనుక, తన ట్యూన్స్ కు తానే ‘బాస్’ అయ్యుండాలని, కనీసం దర్శకుడు కూడా కల్పించుకునే అవకాశం ఉండదని, చాలామంది దర్శకులు తానిచ్చే సలహాలను కనీసం పట్టించుకోరని, తన కెరీర్ లో ఎక్కువ శాతం ‘బ్రెయిన్ లెస్’ దర్శకులతోనే పనిచేసానని, వాళ్ళు కధలు చెప్తున్నపుడే ఆయా సినిమాలు ఫ్లాప్ అవుతాయని భావించానని, కానీ ఇది వాళ్ళకు వినిపించేవి కాదంటూ సినిమాపై తనకున్న పాషన్ ను చాటుకుంటూ తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు.
అంతేకాదు, తన రిటైర్మెంట్ కోసం సంగీత దర్శకుడు థమన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని, ఇప్పటికే దీని గురించి తన అసిస్టెంట్ జీవన్ తో ఒకటి కంటే ఎక్కువసార్లే అడిగాడని చెప్పిన కీరవాణి, ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరాం తన ముఖం పైనే రిటైర్మెంట్ ను సమర్ధించారని, ఆ ధైర్యం అతనికి ఒక్కడికే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా తన కెరీర్ ఎదగడానికి కారణమైన సినీ దిగ్గజాలకు, తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సంగీత సామ్రాట్.



