మొబైల్ ఫోన్లు: మనం వాడుతున్నామా? అవే మనల్ని వాడుకుంటున్నాయా?

Effects of mobile phone addiction on daily life and relationships

ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా లేని రోజుల్లో ఈ ప్రపంచం హాయిగానే సాగింది. అవి వచ్చిన తర్వాత మరింత సుఖంగా సాగింది.

వాటి స్థానంలో మొబైల్ ఫోన్లు వచ్చాక మనుషుల ఆలోచనా ధోరణి మారడం మొదలైంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్‌ మోగితే ఇంట్లో అందరూ దాని చుట్టూ చేరి ఆత్మీయులతో పోటీ పడి సరదాగా సంతోషంగా మాట్లాడేవారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు భార్య భర్తలు, కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అందరి ఎదుట మొబైల్ ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఎందువల్ల?అంటే ఎవరి కారణాలు వారికుంటాయి. కనుక ఈ ప్రపంచాన్ని కలిపే మొబైల్ ఫోన్‌ ఇంట్లో మనుషులను దూరం చేసిందన్న మాట!

ఒకప్పుడు చదువు, ఉద్యోగం, ప్రతిభ, ఆదాయం ఆధారంగా మనుషులకు సమాజంలో గౌరవం లభిస్తుండేది. కానీ మొబైల్ ఫోన్‌లోకి కెమెరాలు వచ్చాక సెల్ఫీలతోనే గుర్తింపు, నలుగురి మెప్పు సంపాదించుకోవాలనే తాపత్రయం పెరిగింది. కానీ ఇదీ ఓ గుర్తింపేనా? ఈ మెప్పు (లైక్స్)తో జీవితం మారిపోతుందా?అని ఎవరూ ఆలోచించరు.

ఆ అల్ప సంతోషమే చాలనుకుంటారు. దాని కోసం ప్రతీరోజూ ప్రతీ గంట ప్రతీ నిమిషం సేల్ఫీలు, రీల్స్ చేసి పోస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ అల్ప సంతోషం కోసం జీవితంలో సాధించాల్సినవి, వాటితో లభించే గుర్తింపు, గౌరవం, సుఖమయమైన జీవితం, ఆ జీవితంలో అనుభూతులు అన్నిటినీ జారవిడుచుకుంటున్నామని గ్రహించేవారు ఎంత మంది?

ఒకప్పుడు ‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం చదువు’ అనే నానుడిని ఇప్పుడు “చిరిగిన బట్టలైన వేసుకో కానీ చేతిలో మొబైల్ ఉంచుకో… సెల్ఫీలు తీసుకో,’ అని చెప్పుకోవాలేమో?

రోజు రోజుకీ ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి ఎందుకు వస్తున్నాయంటే వాటిని మనుషులు ‘అడిక్ట్’ అవడం వల్లనే. యాపిల్ కంపెనీ కొత్త మోడల్ ఫోన్‌ మార్కెట్లో రిలీజ్ చేస్తుంటే, ఉన్నత విద్యావంతులు, టెకీలు తెల్లవారుజాము నుంచే ఆ షాప్ ముందు క్యూకట్టడాన్ని ఏమనుకోవాలి?

ఈ మొబైల్ వాడకం వ్యవసనంగా మారిపోవడంతో చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు అందరికీ కోపం, అసహనం కూడా పెరిగిపోతున్నాయి. మనశాంతి కరువవుతోంది. అందువల్లే చాలా మంది వారంలో ఒకరోజు మొబైల్ ఫోన్‌కి దూరంగా ఉండి మనశాంతితో గడపాలని ప్రయత్నిస్తున్నారు.

మనుషుల ఆలోచనలలో, అలవాట్లలో ఈ మార్పులని చూస్తున్నప్పుడు మనం మొబైల్ ఫోన్లను వాడుకుంటున్నామా లేదా అవే మనల్ని వాడుకుంటున్నాయా?అనే సందేహం కలుగక మానదు. కనుక మనం వాటిని వాడుకోవాలే తప్ప వాటికి మనం బానిసలుగా మారకూడదు.

ADVERTISEMENT
Latest Stories