దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టులో తిరిగి తెరవడానికి అనుమతించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఈ సిఫారసు చేసినట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోవాలి.
ఈ సిఫారసు ప్రకారం, ఆగస్టు 1 వ తేదీ నాటికి సినిమా థియేటర్లు భారతదేశం అంతటా తిరిగి తెరవడానికి అనుమతించబడవచ్చు – లేదా బాగా లేటుగా అనుకుంటే ఆగస్టు 31 నాటికి ఓపెన్ కావాలి. అలాగే సీట్ల మధ్య రెండు గజాల సామాజిక దూరం ఉండేలా వారు సిఫారసు చేశారు.
సినిమాలు వారి పూర్తి సామర్థ్యంలో 25% వద్ద పనిచేయాలని దీని అర్థం. అయితే ఇది ఆర్ధికంగా భారం అనే చెప్పుకోవాలి. మల్టీప్లెక్స్‌లు మినహా మిగతా సినిమా థియేటర్ల వారు ఈ భారం తట్టుకోలేరని చెప్పుకోవాలి. మరోవైపు కేంద్రం థియేటర్లు ఓపెన్ కావడానికి అనుమతిస్తుందా అనేది అనుమానమే.
ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి సంచారం ఎక్కువగా లేని చోట్ల కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. సినిమా థియేటర్లు, జిమ్లు వంటివి ఈ కారణంగా హై రిస్క్ జోన్లుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.





