వేదికలపై చెక్కభజనలు, పూనకాలు దేనికి?

Crowd cheering at a Telugu film event

నాడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి హేమాహేమీలకు లక్షలాదిమంది అభిమానులు ఉండేవారు. తమ అభిమాన హీరోల సినిమా రిలీజ్‌ సమయంలో వారు పోటాపోటీగా హడావుడి చేస్తుండేవారు. వారి మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి కూడా.

కానీ ఆరోజుల్లో మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా లేదు. కనుక వారి హడావుడి ఆ ప్రాంతానికే పరిమితమైయ్యేది. ఆరోజుల్లో సినిమా ఈవెంట్స్ ఇంత అట్టహాసంగా జరిగేవి కావు. వందరోజులు ఫంక్షన్స్ జరిగినప్పుడు, వాటికి హాజరయ్యే ప్రముఖులు హుందాగా ప్రసంగించేవారు. అలాగే ప్రేక్షకులు పద్దతిగా వ్యవహరించేవారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు అంతా టాక్సిక్ (విషపూరితం) అయిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. వేలాదిమంది హాజరయ్యే సినిమా ఈవెంట్స్‌కి మందు కొట్టి వచ్చి, నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు కొందరు. పెద్ద హీరోలకి చెక్క భజనలు చేసేవారు మరికొందరు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ వేదికలపై మాట్లాడేవారు, హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడేవారు కొందరు. సాటి దర్శక నిర్మాతలపై, ప్రభుత్వాలపై సెటైర్లు వేసేవారు, చెప్పుతో కొట్టుకునేవారు… ఇలా రకరకాల మనుషులు ఇప్పుడు వేదికలపై కనిపిస్తున్నారు.

దీనికి తోడూ సోషల్ మీడియా అనే అతిపెద్ద వేదిక లేదా యుద్ధభూమి ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో వినిపించే శబ్దాలు సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో వినిపించే శబ్దాలు సినీ ఫంక్షన్స్‌లో ప్రతిధ్వనిస్తుంటాయి.

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇదే జరిగింది. వేదికపై మాట్లాడినవారందరూ పోటాపోటీగా మెగా భజన చేశారు. బండ్ల గణేశ్‌ అయితే ఏకంగా పూనకం వచ్చినట్లు ఊగిపోయారు.

ఇంతకీ కారణం ఏమిటంటే ‘చిరంజీవి అందరినీ తొక్కేస్తున్నారంటూ’ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. అయితే ఆయనొక్కడిపైనే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందా?

తెలుగు సినీ పరిశ్రమకి ఓ గుర్తింపు, గౌరవం సంపాదించి పెట్టి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటివానీ విడిచిపెట్టలేదు కదా?

బాహుబలి వంటి హిట్ అందించిన ప్రభాస్‌, ఆదిపురుష్, రాధేశ్యామ్‌, రాజసాబ్ వంటి సినిమాలతో ఎదురుదెబ్బలు తిన్నప్పుడు ఆయనతో సోషల్ మీడియాలో ఏవిధంగా ఆడుకున్నారో అందరికీ తెలుసు కదా?

కానీ మెగా ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అంటే, దానికి వేదికపై ఇంత పూనకాలు, పోటాపోటీ భజనలు దేనికి?

మెగా భజనలో తన్మయత్వం చెందితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సినీ పరిశ్రమలో అందరూ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు కదా?

కనుక ఇలాంటి సందర్భం, వేదిక దొరికినప్పుడు అలాంటి అవాంచనీయ ధోరణిని ప్రశ్నించాలి. మానుకోమని హితవు పలకాలి.

ఒకవేళ అది తమ వల్లకాదనుకుంటే, పునాది రాళ్ళు మొదలు చిరంజీవి చేసిన వందలాది సినిమాలు, వాటిలో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు, అయన ప్రత్యేక స్టైల్, డాన్సింగ్ స్టైల్, అయన ఎదుగుదల, ఆయన పేరిట నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, అందుకున్న అవార్డుల గురించి చెప్పుకుంటే బాగుండేది. కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఇలాంటి వేదికలపై చెక్క భజనలు, పూనకాలు దేనికి?

ADVERTISEMENT
Latest Stories