మాచర్లలో అర్దరాత్రి టిడిపి నేత అన్వర్ బాషా అరెస్ట్‌!

Muslim TDP Leader Arrested On Bakridముస్లింలకు అత్యంత ప్రధానమైన పండుగలలో శుక్రవారం జరిగిన బక్రీద్ పండుగ కూడా ఒకటి. ఆ పండుగకు ముందు అంటే బుదవారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జెండా చెట్టు ప్రాంతంలో బుచ్చమ్మ బజారులో నివశిస్తున్న టిడిపి మైనారిటీ నేత సయ్యద్ అన్వర్ బాషాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదీ… అర్దరాత్రి పూట మఫ్టీలో వచ్చి! అర్దరాత్రి ఎవరో వచ్చి తలుపు తట్టి మేము పోలీసులమని చెప్పి ఇంటి యజమానిని పట్టుకుపోతే ఇంట్లో భార్య, పిల్లలు ఎంత భయాందోళనలు చెందుతారో ఊహించుకోవచ్చు. అదే జరిగింది.

ఒక గంటలో విచారించి పంపించేస్తామని చెప్పి తీసుకువెళ్ళిన అన్వర్ బాషా మర్నాడు ఉదయానికి కూడా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆయన భార్య, బంధుమిత్రులు నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డిని కలిసి చెప్పడంతో అందరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అన్వర్ బాషా కోసం వాకబు చేశారు.

ADVERTISEMENT

పోలీసులు ఆయనను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లిన్నట్లు తెలియడంతో అన్వర్ బాషా తల్లి సయ్యద్ మీరాబీ, భార్య అయేషా, పిల్లలతో కలిసి అక్కడకు చేరుకొన్నారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించారు. పోలీసులు ఆయనను జైలుకు తరలిస్తున్నప్పుడు తల్లీ, భార్యా, పిల్లలను చూసి ఆయన, ఆయనను చూసి వారు కన్నీళ్ళు పెట్టుకొని రోదించారు. వారిని చూసి అందరూ కంట తడిపెట్టారు.

అన్వర్ బాషా మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల క్రితం కారంపూడిలో జరిగిన గొడవకు నాకూ ఎటువంటి సంబంధమూ లేకపోయినా నేను టిడిపిలో ఉన్నందుకు పోలీసులు నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. ప్రజలు తమకు నచ్చిన పార్టీలో ఉండటం నేరమా?ఉంటే ఇలా అక్రమకేసులు బనాయించి అరెస్ట్‌ చేస్తారా?అయినా బక్రీద్ పండుగ ముందు అరెస్ట్‌ వారెంట్ లేకుండా అర్దరాత్రి పూట రహస్యంగా నన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్ర జరిగినప్పుడు దానిని విజయవంతం చేశారు. బహుశః అందుకే వైసీపీ నేతల దృష్టి ఆయనపై పడిన్నట్లుందని నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. టిడిపి నేతలను, పార్టీ కోసం పనిచేసేవారిపై ఈవిదంగా అక్రమకేసులు బనాయించి భయాందోళనలకు గురిచేయడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని అన్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా…లేక రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా….మీకు మానవత్వం ఉందా…? ఒక ముస్లిం సోదరుడిని బక్రీద్ పండుగ రోజు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి…ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి పండుగ పూట జైలుకు పంపుతారా?

మాచర్లలో టీడీపీ కార్యకర్త సయ్యద్ అన్వర్ బాషా అరెస్టు జగన్ రెడ్డి ఫాసిస్టు పాలనకు నిదర్శనం. తండ్రిని పోలీసులు తీసుకువెళుతుంటే తల్లడిల్లుతున్న ఆ బిడ్డకు మీరు ఏం సమాధానం చెపుతారు? ఈ వికృత రాజకీయ క్రీడకు, అమానవీయ పోకడలకు మీరు, మీ పార్టీ నేతలు ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తారు.

బక్రీద్ నాడు అరెస్టుతో ఒక ముస్లిం కుటుంబాన్ని క్షోభకు గురి చేసిన పాపం పోలీసులను, కుట్ర చేసిన వైసీపీ నేతలను వెంటాడుతుంది. ముస్లిం సమాజం మీ చర్యను గమనిస్తోంది. మీకు గట్టిగా బుద్దిచెపుతుంది,” అని ట్విట్టర్‌ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories