కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో జగన్ పోకడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మిక్కిలి సన్నిహితులుగా ఉన్న వారిని వదిలేసి, వైఎస్ తన రాజకీయ జీవితంలో వ్యతిరేకించిన వారిని దగ్గరకు తీసుకోవడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దీనిపై రాజకీయాల్లో పెద్ద రగడే జరిగినా జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా వైయస్ వ్యతిరేకుల్ని తన చెంత చేర్చుకున్నాడు. ఆ క్రమంలోనే తను జైలుకు వెళ్ళిన సమయంలో పార్టీకి అండగా ఉండాలని కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మైసూరా రెడ్డిని కోరారు.
జగన్ విజ్ఞప్తిని పరిగణించిన మైసూరా, టిడిపిని వదిలి వైసీపీ బాధ్యతలు చేపట్టి తన విధేయతను చాటుకుంటూ పార్టీకి సేవలు అందించారు. అయితే మైసూరా వెన్నంటే ఉండే ప్రతిపక్ష హోదా వైసీపీని వరించడంతో, పార్టీలో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు మైసూరా. అంతేగాక, జైలు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా తానై అయ్యి, పార్టీని నడిపించడంతో మైసూరా వంటి సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు బహిరంగంగానే వెలువడ్డాయి. తాజాగా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ జగన్ పార్టీకి ‘టాటా’ చెప్పేసారు మైసూరా.
“జగన్ కు అధికార పీఠంపైనే మక్కువ ఎక్కువని, మాటకు నిలకడ లేని జగన్ ప్రజాసమస్యలపై పోరాడాలన్న సంకల్పం లేదని, చెప్పిన సలహాలను పెడచెవిన పెట్టడం జగన్ నైజమని, పార్టీలో డబ్బులకు తప్ప మనుషులకు విలువ లేదని” తీవ్ర విమర్శలు చేస్తూ నాలుగు పేజీల రాజీనామా లేఖను జగన్ కు పంపారు. తానూ ఏ పార్టీలో చేరే విషయం ఇంకా నిర్ణయించుకోలేదని, పార్టీలో ఉన్నన్నాళ్ళు నమ్మకంగానే పని చేశానని మైసూరా తన ఆవేదనను వ్యక్తపరిచారు.
ఇలా పార్టీలో ఒక్కొక్కరిని వదులుకుని జగన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో మాత్రం రాజకీయ వర్గాలకు అంతు పట్టని విషయం. ఒక పక్క ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ టిడిపి చెంత చేరుతున్న వైనం గమనిస్తూనే ఉన్నాం. మరో పక్క పార్టీకి ముఖ్యమైన సలహాలకు ఉపయోగపడే మైసూరా వంటి సీనియర్ నేతలు వదిలి వెళ్ళే విధంగా జగన్ ప్రవర్తించడం అనేది… నిజంగా జగన్ కు రాజకీయాలపై ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.



