వైసీపీని వీడుతూ వెళ్ళిన సీనియర్ పొలిటిషియన్ మైసూరారెడ్డి… ఓ నాలుగు పేజీల లేఖను రాసి… అందులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఏకిపారేసారు. జగన్ వ్యవహారం ‘అపరిచితుడు’ క్యారెక్టర్ ను తలపిస్తోందని ఘాటు వ్యాఖ్య చేసిన మైసూరా, మానవీయ కోణంలోనే తాను వైసీపీలో చేరానని స్పష్టం చేసారు. అయితే అదే మానవీయ కోణం జగన్ కు ఈ మాత్రం లేదని విమర్శించారు.
కుటుంబ సభ్యుల్లో చిచ్చుపెట్టే సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఉండదన్న మైసూరా.., పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగానే కాక కనీసం ఫోన్ లో కూడా దొరకరని నేతగా జగన్ కీర్తిని గడిస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు అధికార పీఠంపైనే మక్కువ ఎక్కువని, నిలకడ లేని మాటలకు జగన్ నిదర్శనం అని, ప్రజాసమస్యలపై పోరాడాలన్న సంకల్పం లేని ఈ యువనేత, ఎవరైనా సలహాలు చెప్తే పెడచెవిన పెట్టడం ఆయన నైజమని, వైసీపీలో డబ్బులకు తప్ప మనుషులకు విలువ లేదని… పార్టీ అంతర్గత వ్యవహారాల నుండి అంతా క్షుణ్ణంగా వివరించారు.
నిజానికి మైసూరా వ్యక్తపరుస్తున్న ఆవేదనలో అర్ధముంది. ఆనాడూ జగన్ జైలుకు వెళ్ళిన సందర్భంలోనే మైసూరా వైసీపీలో చేరారు. అది కూడా… జగన్ చేసిన విజ్ఞప్తుల మేరకే! జైలుకు వెళితే పార్టీ ఏమైపోతుందో అన్న భయంతో మైసూరాను జగన్ స్వయంగా కోరడంతోనే పార్టీలోకి వచ్చినట్లుగా అప్పుడే స్పష్టం చేసారు. మరి అంతటి మానవీయ కోణంలోనే పార్టీలోకి వెళ్ళిన మైసూరా, ఈనాడు బయటకు రావడానికి బలమైన కారణాలు ఉన్నాయని అంగీకరించి తీరాల్సి వస్తోందని రాజకేయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేకాదు, మైసూరా చేసిన విమర్శలలోనూ ఓ అర్ధముంది అంటున్నారు విశ్లేషకులు.



