“ఛలో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి నాగశౌర్య పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వైనం తెలిసిందే. నిహారికతో వివాహం అంటూ ఓ పక్కన పుకార్లు షికార్లు చేయగా, మరో వైపు చిరంజీవిని ఒక్కసారిగా ఆకాశానికేత్తేస్తూ చేసిన కామెంట్స్ తో, ట్రేడ్ వర్గాలలోనే కాక అభిమానుల్లోనూ నాగశౌర్య పేరు బాగా హల్చల్ చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుండి జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని చెప్పిన శౌర్య, ‘చలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘మెగాస్టార్ అండ్ కో’ను హైలైట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ గందరగోళం అంతా నెలకొంది.
అయితే ఆ తర్వాత ‘ఛలో’ విడుదల కావడం, కమర్షియల్ గా మంచి విజయవంతం కావడంతో, పుకార్లన్నీ పక్కకు వెళ్లి హీరోగా మరో మెట్టు ఎదిగాడు శౌర్య. ఇంత హంగామాకు కారణమైన నాగశౌర్య లేటెస్ట్ గా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినపడుతోంది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తోన్న దర్శకుడు కాశీ విశ్వనాథ్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని శౌర్య హీరోగా ఓ సినిమా చేయాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘గురువారం మార్చి 1’ అనే పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నాగశౌర్య చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు ముగిసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తరుణ్ కెరీర్ తొలినాళ్ళల్లో ‘నువ్వు లేక నేను లేను’ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన కాశీ, ఈ యువ హీరో నాగశౌర్యకు ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి. అయితే ఈ సినిమా టైటిల్ ప్రిన్స్ మూవీకి సంబంధించినది కావడంతో, శౌర్య నెక్స్ట్ టార్గెట్ మహేష్ బాబు అభిమానులేనా అన్న టాక్ ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఏమో… ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే..! సినిమా బాగున్నంత వరకు ఏం చేసినా బాగానే ఉంటుంది… లేదంటేనే విమర్శల పాలవ్వాల్సి వస్తుంది.



