తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన నాగం జనార్దన్ రెడ్డి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో తన పాదముద్రను వేసినట్టే ఉన్నారు.తెలుగుదేశం పార్టీలో కూడా నాగం పలు మంత్రి పదవులు అనుభవించి రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం అంటూ ఆపార్టీ పదవికి రాజీనామా చేసి “తెలంగాణ నగారా” పేరుతో కొత్త పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.
తానూ స్థాపించిన పార్టీలో తానొక్కడే ఉండలేకపోయారో ఏమో కానీ ఆయన సొంత పార్టీకి నీళ్లు వదిలేసి బీజేపీ పార్టీ కమలాన్ని అంది పుచ్చుకున్నారు. నిలకడలేని రాజకీయాలలో ఏఒక్క నిర్ణయానికి కట్టుబడి ఉండలేక మరల బీజేపీ నుండి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు మరల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మొదలవడంతో కండువాలు మార్చుకోవడానికి నాగం సిద్దమైనట్లున్నారు.
ప్రతి ఎన్నికలలో సొంత పార్టీ పై విమర్శలు చేయడం మరో కొత్త పార్టీని వెతుక్కోవడం నాగం రాజకీయ వ్యూహంలో భాగమో ఏమో కానీ ఇప్పుడు మరల ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి పై టికెట్టులు అమ్ముకుంటున్నారు అంటూ ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చే పనిలో ఉన్నారు నాగం. ఇలా ప్రతి ఎన్నికలకు పార్టీ కండువాలు మారుస్తూ నాగం చేస్తున్న యాగీ చూస్తుంటే ఇప్పటి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు ఇటువంటి నాయకులే సరిపోతారేమో అనే అనుమానం రాకమానదు.
ప్రతి ఐదేండ్ల కొకసారి తన రాజకీయ పార్టీ కండువాలు, సిద్దాంతాలు మార్చుకుంటూ ఇప్పటికే టీడీపీ, బీజేపీ,కాంగ్రెస్ ఇలా తెలంగాణాలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్నిటిలో తన రాజకీయ ప్రస్తావాన్నీ ముగించుకున్న నాగం ఇక ప్రస్తుత అధికార పక్షమైన బిఆర్ఎస్ పార్టీ కారు ఎక్కుతారేమో అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇన్నిసార్లు పార్టీ కండువాలను మారుస్తున్నందున ఇక ఈసారి ఎన్నికలతో నాగం రాజకీయ జీవితం ఆగమాగమే అంటున్నారు టి.కాంగ్రెస్ నాయకులు.




