‘విక్రమ్’ సినిమాతో మొదలైన సినీ ప్రయాణంలో మనసంతా ‘ఊపిరి’ నిండుకుంది. తొలినాళ్ళల్లో తను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కమర్షియల్ సినిమాల వైపుకు మళ్ళినా… కాలక్రమేణా పరిపక్వత కలిగిన పాత్రలు, ప్రయోగాత్మక పాత్రలకు ‘కింగ్’ నాగార్జున కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇటీవల కాలంలో అయితే అది పతాక స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ‘మనం’ సినిమా నుండి మొదలైన మరో కెరీర్ నాగార్జునలోని మరో కోణాన్ని అభిమానులకు సుపరిచితం చేసింది.
ఆ క్రమంలోనే తన సినీ ప్రస్థానానికి నేటికి 30 ఏళ్ళు పూర్తయ్యాయి. ఎన్నో చరిత్ర సృష్టించిన సినిమాలు, మరెన్నో మధురానుభూతులను కలిగించిన సినిమాలను అందించిన నాగార్జున… ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురై, సోషల్ మీడియా ద్వారా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ఎప్పుడూ సంయమనంతో ఉండే నాగ్, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కాలం చేసిన నాటి నుండి ఎక్కువ భావోద్వేగాలకు గురవుతూ వస్తున్నారు. పలు ఆడియో వేడుకలపై ఈ విషయాన్ని అభిమానులు కూడా గుర్తించారు. అయితే, 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాగ్ చేసిన ట్వీట్ కూడా ఫ్యాన్స్ ను భావోద్వేగాలకు గురి చేస్తోంది.
“30 సంవత్సరాల నుండి కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందిందని, వీళ్ళంతా ఇదే సహకారం మరో 30 ఏళ్ళకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ప్రయాణంలో అమ్మా, నాన్నలను మిస్ అయినందుకు బాధగా ఉందని, అందరికీ కృతజ్ఞతలు…” అంటూ అమల, తను ఉన్న ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. తనకు సహకారం అందించిన ఆనందం నాగ్ కళ్ళల్లో కనపడుతున్నా, అంతకు మించిన కృతజ్ఞత భావం తారసపడడం… బహుశా అక్కినేని అభిమానులపై నాగ్ కున్న ప్రేమాభిమానాన్ని చాటిచెప్తోంది. నాగ్ అన్నట్లు… మరో 30 ఏళ్ళు కూడా ఇదే అభిమానం మరింతగా కొనసాగాలని ఆశిద్దాం.



