‘మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి’ వంటి విలక్షణ పాత్రలలో నటిస్తూ…
ప్రేక్షకుల మన్నననలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్
నాగార్జున తాజాగా మరో అద్భుతమైన పాత్రకు ప్రాణం పోసేందుకు
సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘అన్నమయ్య, శ్రీరామదాసు’ చిత్రాలతో భక్తిరస
చిత్రాలంటే తానే చేయాలి అనే విధంగా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసిన
నాగార్జున మరోసారి “ఓం నమో వేంకటేశాయ” సినిమా ద్వారా ప్రేక్షకులను
పలకరించడానికి శ్రీకారం చుట్టారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల
రికార్డింగ్ ఇటీవలే తిరుపతిలో ప్రారంభం కాగా, తాజాగా శనివారం నాడు ఈ
సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. మొదటి షాట్ ను కింగ్ నాగార్జున రెండు
చేతులు పెట్టి నమస్కారం చేస్తుండగా, దర్శకేంద్రుడు కెమెరా ఆన్ చేసి షూట్
చేస్తున్నాడు. సీనియర్ కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ
బాధ్యతలను పర్యవేక్షిస్తుండడం ఈ సినిమాకు మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.
చూడబోతుంటే… మరో దృశ్యకావ్యాన్ని నాగ్ + రాఘవేంద్రుడు
అందించబోతున్నారన్న విషయాన్ని ఈ ఫోటో ఖరారు చేస్తోంది.



