చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, బాబుకి అండగా నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే బస చేసున్న విషయం విదితమే. చంద్రబాబు పై పడిన మచ్చ తొలగి బాబు బయటకు రావాలని అన్నవరం సత్యదేవునికి పూజలు చేసిన భువనేశ్వరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ చేయని అవినీతి చంద్రబాబు ఇప్పుడు చేశారంటే నమ్మడానికి సిద్ధంగా ప్రజలు లేరనే సత్యాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించాలంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శిలల పై శిల్పాలు చెక్కినారూ అన్న చందంగా రాళ్ల గుట్టలుగా ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. అభివృద్ధి విలువ అరాచకానికి తెలుస్తుందా? విధ్వంసం తాలూకా పాలనకు నిర్మాణాల విలువలు తెలుస్తాయా?
ప్రభుత్వాలు చేసే సేవా కార్యక్రమాలకు ధీటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో సేవ కార్యక్రమాలు చేస్తున్న తమ పై ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సబబో ఆలోచించాలి. మా కుటుంబానికి ప్రజల సొమ్ము మీద ఆశ లేదు. మా కంపెనీ లో రెండు శాతం వాటా అమ్మినా మాకు నాలుగు వందల కోట్లు వస్తాయి. వాటి కోసం అవినీతికి పాల్పడాల్సిన అవసరం చంద్రబాబుకి లేదని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రెండు వేల మంది అనాధ – పేద పిల్లలకు ఉచితంగా విధ్య నందిస్తున్న మా కుటుంబం పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలే తిప్పికొట్టాలి. ఆయన ఆలోచన ఎప్పుడు రాష్ట్ర ప్రజల గురించే ఉంటుంది. కుటుంబాన్ని వదులుకుని ఇన్నాళ్లు చేసిన ప్రజాహిత చర్యలకు చంద్రబాబుకి ఇచ్చే గౌరవం ఇదేనా? స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమం ద్వారా ఎందరో ఉపాధి పొందారు. మరెందరో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. అదే చంద్రబాబు చేసిన తప్పా? వైసీపీ విధ్వంసానికి చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి అంటూ అటు పార్టీ నేతలకు మనోధైర్యాన్ని అందించారు నారా భువనేశ్వరి.



