పార్టీ క్యాడర్ కు ఎప్పుడు అందుబాటులో ఉండే చంద్రబాబు ఇప్పుడు స్కిల్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉండడంతో, ఆయనను బయటకు తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటాలతో లోకేష్ బిజీగా ఉండడంతో పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఈ సమయంలో అండగా నిలబడ్డారు భువనేశ్వరి.
చంద్రబాబు పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బాబుకి మద్దతుగా నిరాహార దీక్షలు, సంఘీభావ యాత్రల పేరుతో పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తమకు మద్దతుగా నిలబడిన ప్రజలకు, ఐటీ ఉద్యోగులకు, పార్టీ నేతలకు కృతఙ్ఞతలు తెలిపిన భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో తనదైన ముద్రను వేశారు.
పార్టీ క్యాడర్ ను తన బిడ్డలతో పోలుస్తూ భువనేశ్వరి ఇచ్చిన స్టేటుమెంట్స్ తమ కుటుంబానికి పార్టీ కార్యకర్తల మీద ఉన్నఅపారమైన ప్రేమను, ఆప్యాయతను తెలియచేసింది. అలాగే తనకు సంఘీభావం తెలపడానికి రాజమండ్రికి వస్తున్న తమ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వ వైఖరికి ఖండిస్తూ తన గళాన్ని వినిపించారు.
తాజాగా కొల్లు రవీంద్ర పై ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ భువనేశ్వరి తన సామజిక మాధ్యమంలో స్పందించారు. తల్లి వర్థంతి కార్యక్రమానికి వెళ్లకుండా ఒక మాజీ మంత్రిని ఆపడానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉంది అంటూ ప్రశ్నించారు. ఇటువంటి దారుణాలు దేశంలో మరెక్కడైనా జరుగుతున్నాయా? ఇదేమి చట్టం? ఇదెక్కడి న్యాయం? రాజకీయ కక్షలతో వ్యక్తిగత కార్యక్రమాలను కూడా అడ్డుకుంటారా?
ఇటువంటి సాంప్రదాయ కార్యక్రమాలకు ప్రభుత్వ ఆంక్షలు ఎందుకో? సంప్రదాయాలను రాజకీయాలతో ముడిపెట్టవచ్చా? వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్దలు నిర్వీర్యం అయ్యిపోతున్నాయి అంటూ బాబు చేసిన విమర్శలకు సాక్ష్యాలుగా కొల్లు రవీంద్ర ఉదంతం నిలబడింది. టీడీపీ నేతల పై ఇటువంటి ఆంక్షలు తనను ఎంతగానో బాధిస్తున్నాయి అంటూ భువనేశ్వరి తెలిపారు.
ఇలా టీడీపీ పార్టీ నేతల మీద ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ ప్రభుత్వానికి ఎదురీదుతున్న భువనేశ్వరి తీరు ప్రశంసించదగ్గది. మునుపెన్నడూ రాజకీయ వేదికల మీద ప్రసంగించని భువనేశ్వరి ఇప్పుడు ఒక బలమైన రాజకీయ పార్టీని ఎదిరించి తమ పార్టీని నమ్ముకున్నవారికి అండగా నిలబడిన విధానం, సమస్యల మీద స్పందించిన తీరు అభినందించదగ్గదే.




