నలబై రోజులుగా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దూరం అవడంతో పార్టీలో ఓ రకమైన స్తబ్దత నెలకొంది. చంద్రబాబు నాయుడుపై కోర్టులో కేసులు సాగుతున్న తీరు చూస్తున్న ప్రజలకు కూడా ఇదిప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదని అర్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ హడావుడి కూడా మొదలవడంతో ప్రజలు దృష్టి అటువైపు మళ్ళింది.
ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల మద్యకు, పార్టీ శ్రేణుల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి జిల్లా పర్యటనలకు బయలుదేరబోతున్నారు. పనిలో పనిగా జిల్లాలలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె ముఖాముఖీ సమావేశమవుతూ తదుపరి కార్యాచరణ గురించి చర్చించనున్నారు.
ఢిల్లీకి వెళ్ళిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా గురువారం విజయవాడకు తిరిగి వచ్చేశారు. చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత ఆయన కూడా పార్టీ కార్యక్రమాలపై సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం జరుపుతారు.
తర్వాత నారా లోకేష్ కూడా ప్రజల మద్యకు వెళ్ళి టిడిపి ప్రకటించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రామాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా “బాబుతో నేను” పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కూడా నారా లోకేష్ పాల్గొంటారు.
మళ్ళీ పూర్తిస్థాయిలో వైసీపి ప్రభుత్వంపై పోరాటాలు ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. టిడిపి శ్రేణులు కూడా అందుకు సిద్దంగానే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో టిడిపి నేతలెవరూ ప్రజల మద్యకు వెళ్ళకుండా పోలీసులతో అడ్డుకొంటున్న వైసీపి ప్రభుత్వం, నారా భువనేశ్వరి, లోకేష్ జిల్లా యాత్రలు చేయడానికి బయలుదేరితే చూస్తూ ఊరుకొంటుందని అనుకోలేము. కనుక రాష్ట్రంలో మళ్ళీ టిడిపి, వైసీపిల మద్య యుద్ధవాతావరణం అనివార్యమే అని భావించవచ్చు.




