ఈ 2023 సంవత్సరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీవితంలో ఓ చేదు అనుభవం మిగిలిస్తే, ఇదే సంవత్సరం ఆయన కుమారుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్రతోనే నారా లోకేష్ తనకంటూ సొంత గుర్తింపు సృష్టించుకొన్నారు. అంతవరకు ప్రజలకు, ముఖ్యంగా వైసీపి నాయకులకు… తన పట్ల ఉండే అపోహలు, చులకనభావాన్ని ఈ ఒక్క యువగళం పాదయాత్రతో నారా లోకేష్ పటాపంచలు చేసేశారు.
నిజానికి నారా లోకేష్ పదిరోజులకే పాదయాత్ర చాలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోతే ఆయనతో ఓ ఆటాడుకోవాలని ఆశగా ఎదురుచూసిన వైసీపి నేతలను తీవ్ర నిరాశపరుస్తూ ఎండనక, వాననక ముందుకే సాగారు. నారా లోకేష్ మద్యలో పాదయాత్ర విరమించుకోరని గ్రహించగానే వైసీపి ప్రభుత్వం పోలీసులతో ఆయనను అడ్డుకొనేందుకు విఫలయత్నాలు చేసింది.
కానీ దాంతో తామే నారా లోకేష్‌కి ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తూ, ఆయనని ప్రజలలో మరింత పాపులర్ చేస్తున్నామని గ్రహించగానే వైసీపి ప్రభుత్వం ఆ ప్రయత్నాలు విరమించుకొంది. కానీ అప్పటికే పోలీసులతో ఓవర్ యాక్షన్ చేయించినప్పుడు నారా లోకేష్ వారిని ఎదుర్కొన్న తీరుతో యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సామాన్య ప్రజలలో ఒకడిగా కలిసిపోయి అందరి అభిమానాన్ని సంపాదించుకొన్నారు. సామాన్య ప్రజల కష్టాలను, కన్నీళ్ళని స్వయంగా చూసి వారికి ధైర్యం చెపుతూ భవిష్యత్‌పై ఆశ, నమ్మకం కలిగించగలిగారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు అవుతూ ముందుకు సాగుతుండటం వలన తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నానని నారా లోకేష్ స్వయంగా చెప్పుకొన్నారు.
జగన్.. వైసీపి అడ్డా… కడపలో నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తున్నపుడు టిడిపిలో అందరూ ఆయన భద్రత గురించి చాలా ఆందోళన చెందారు. కానీ నారా లోకేష్ మాత్రం జగన్-వివేకాల ఫోటోలతో కూడిన ప్లకార్డు పట్టుకొని కడప నడిబొడ్డున నిర్భయంగా నిలబడి ‘హూ కిల్డ్ బాబాయ్?’ అంటూ ప్రశ్నించి తన తెగువని చాటుకొన్నారు.
ఈ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సభలు, ప్రత్యేక సభలు, సమావేశాలలో వేలాదిమంది ఎదుటనిలబడి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయం, విద్యుత్, వైద్య ఆరోగ్య, మౌలికవసతుల కల్పన తదితర రంగాలకు సంబందించిన అంశాలపై పూర్తి సాధికారతతో మాట్లాడారు. తద్వారా తనకు చాలా విషయ పరిజ్ఞానం ఉందని నారా లోకేష్ నిరూపించుకొన్నారు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు టిడిపి, నారా లోకేష్ పని అయిపోయిందనే వైసీపి నాయకులు అనుకొన్నారు. కానీ సమస్యలనే అవకాశాలుగా మలుచుకోవాలనే తండ్రి బాటలోనే నడుస్తూ నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళి అక్కడ జాతీయమీడియాతో మాట్లాడుతూ యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. దీంతో కంగారు పడిన వైసీపి ప్రభుత్వం ఏపీ సీఐడీ చీఫ్‌ని కూడా ఢిల్లీకి పంపించి సంజాయిషీలు చెప్పించుకోవలసి రావడం అందరూ చూశారు.
కనుక నారా లోకేష్ గత రెండు దశాబ్ధాల రాజకీయ జీవితం ఒక ఎత్తు అనుకొంటే, ఈ 2023 సంవత్సరం ఒక్కటీ ఒక ఎత్తు అని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో ఇది ఆయనను రాజకీయాలలో ఏ స్థాయికి తీసుకువెళుతుందో 2024లో చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ 2023 సంవత్సరం ఖచ్చితంగా నారా లోకేష్‌దే అని చెప్పవచ్చు.




