ప్రజా దర్భార్ క్యూలైన్ ఏం చెపుతోందంటే….

Nara Lokesh Faces Rush at 70th Praja Darbar

మంత్రి నారా లోకేష్‌ మంగళవారం అమరావతిలో పార్టీ కార్యాలయంలో 70వ ప్రజా దర్భార్ నిర్వహించారు. ఆయనకు వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్య చెప్పుకునేందుకు వేలాదిమంది ఉదయం నుంచే పార్టీ కార్యాలయం ముందు క్యూ కట్టారు.

ప్రజా దర్భార్ కోసం అంత మంది రావడం చూసి మంత్రి నారా లోకేష్‌ మొదట ఆశ్చర్యపోయినా, అది తమ అలసత్వానికి నిదర్శనమని పార్టీ నేతలకు చివాట్లు పెట్టినట్లు సమాచారం. అదే వాస్తవం కూడా.

ADVERTISEMENT

తరచూ ప్రజా దర్భార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లయితే అంత మంది క్యూ కట్టేవారు కదా?

వాస్తవానికి ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరించడం ఏ ప్రభుత్వం వల్లా కాదు. ఒకవేళ పరిష్కరించేసినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకువస్తూనే ఉంటాయి. కనుక ఇకపై తరచూ ప్రజా దర్భార్ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్‌ మంచి సూచన చేశారని చెప్పవచ్చు.

అయితే ఈ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా లేదా ప్రచారం కోసం కాకుండా నిజంగానే ప్రజా సమస్యలను పరిష్కరించగలిగితే ‘ప్రజా దర్భార్’ విలువ, గౌరవం పెరుగుతాయి.

మంత్రి నారా లోకేష్‌ నిన్న 4 గంటలలో 4,000 మందితో మాట్లాడి వినతి పత్రాలు తీసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై వైసీపీ వేసిన ఓ ప్రశ్న ఆలోచింపజేస్తుంది. కేవలం 4 గంటలలో 4,000 మందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం ఎలా సాధ్యం?అని ప్రశ్నించింది.

ఈ లెక్కన గంటకు వెయ్యి మంది, నిమిషానికి 16 మందితో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడటం సాధ్యమేనా? అంటే కాదనే అర్ధమవుతోంది. కానీ ఇదే నిజమనుకుంటే వారిలో కొంతమందితో మాట్లాడి 4,000 మంది నుంచి వినతి పత్రాలు తీసుకొని పంపించేశారని అనుకోవలసి ఉంటుంది.

ఇలా మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలకు ప్రభుత్వం పట్ల అభిమానం పెరుగకపోగా వ్యతిరేకతం పెరుగుతుంది. అప్పుడది వైసీపీకి అస్త్రంగా మారుతుందని మరిచిపోకూడదు.

గంటకు ఎన్ని వినతి పత్రాలు స్వీకరించమనే రికార్డుల వలన ఎటువంటి ఉపయోగమూ ఉండదు. పార్టీ కార్యాలయం బయట డబ్బా పెడితే అంతకంటే ఎక్కువే దానిలో పడతాయి కదా?

ప్రజలు మంత్రి నారా లోకేష్‌ని స్వయంగా కలిసి ఎందుకు మాట్లాడాలనుకున్నారు?అంటే ఆయన మాత్రమే తమ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారనే ఆశతోనే. కనుక వారి ఆశని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది.

ఈవిదంగా ప్రజా దర్భార్ నిర్వహించి ప్రజలను ముఖాముఖి కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం చాలా అభినందనీయమే. కానీ అది మొక్కుబడిగా కాకూడదు. తీరికగా మాట్లాడేంత సమయం లేదనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు.

సిఎం చంద్రబాబు నాయుడు ఎలాగూ ప్రజా సమస్యల పరిష్కారానికి ‘వాట్సప్‌ గవర్నెన్స్’ పేరుతో ఓ మొబైల్ యాప్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కానీ అది ‘యూజర్ ఫ్రెండ్లీ’గా లేకపోవడం, దాంతో సమస్యలు పరిష్కారం కాకపోవడం వలననే పార్టీ కార్యాలయం ముందు జనాలు ఇలా క్యూ కడుతున్నారు.

కనుక ‘ప్రజాదర్భార్’ ‘వాట్సప్‌ గవర్నెన్స్’ రెండూ ఉన్నాయని చెప్పుకునేందుకు కాక అవి మరింత సమర్ధంగా, వేగంగా పనిచేసేలా చేయడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories