చంద్రబాబు జమానాలో జరిగిన అవినీతి వెలికితీయడానికి అంటూ జగన్ ప్రభుత్వం ఓ మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. కీలక విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలను సబ్‌కమిటీ సమీక్షిస్తుంది. చంద్రబాబును జైలు కు పంపడమే మా లక్ష్యం అంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న పెండింగ్ కేసుల లిస్టు ప్రచురించి మరీ ఎద్దేవా చేశారు లోకేష్.
“జగన్ గారూ! అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సార్! మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది,” అంటూ లోకేష్ కొత్త ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు.
“పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల…కల గానే మిగిలిపోతుంద,” అని ఎద్దేవా చేశారు లోకేష్. ఇప్పటికైనా లోకేష్ ఘాటుగా స్పందించడాన్ని టీడీపీ అభిమానులు ఆహ్వానిస్తున్నారు. మునుముందుకూడా ఇదే దూకుడు ప్రదర్శించాలని వారు కోరుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు లోకేష్ పై ట్విట్టర్ లో దాడి చేస్తున్నారు.



