ఏపీలో మౌలిక సదుపాయాలు జీరో… పన్నులు 100%

Nara_Lokesh_Jagan_Taxesటిడిపి యువనేత నారా లోకేష్‌ బుదవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో 54వ రోజు యువగళం పాదయాత్ర పూర్తి చేశారు. పెనుకొండలో వ్యాపారస్తులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నప్పుడు నారా లోకేష్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ప్రభుత్వం ఆదాయం పెంచుకొనేందుకు స్థిరాస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను నిర్ణయించింది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ కంటే కూడా ఆంద్ర రాష్ట్రంలో స్థిరాస్థి పన్ను ఎక్కువగా ఉంటోంది.

పన్ను పెంచుకొని వసూలుచేసుకోవడం ప్రభుత్వం ఇష్టం. అయితే వసూలు చేస్తున్న పన్నుకు తగ్గట్లుగా ప్రజలకు మౌలికసదుపాయాలు కల్పిస్తోందా? అంటే లేదు. ఎక్కడ చూసి గుంతలు పడిన రోడ్లు, వెలగని విద్యుద్దీపాలు, మురుగుకాలువలే. పైగా ఈ పన్ను సరిపోదన్నట్లు వైసీపీ ప్రభుత్వం అదనంగా చెత్తపన్ను కూడా వసూలు చేస్తోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా చిరువ్యాపారస్తులను వేధించి, భయపెట్టి ముక్కు పిండి మరీ చెత్తపన్ను వసూలు చేస్తోంది ఈ జగన్‌ ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా చెత్తపన్ను చెల్లించడానికి నిరాకరిస్తే రోడ్లపై చెత్త తీసుకువచ్చి వారి దుకాణాల ముందు పోసి ఇబ్బంది పెడుతున్నారు. మీరు తప్పనిసరిగా చెత్తపన్ను కట్టాల్సిందే అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఇలాంటి చెత్త ఐడియాలు, చెత్త పన్నులు, చెత్త పనులు చేయలేదు. అయినా రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ఎక్కడిక్కడమౌలిక సదుపాయాలను కల్పించేవారు. ఇవన్నీ మీరు స్వయంగా చూసినవే…. మీకు తెలిసినవే,“ అని నారా లోకేష్‌ అన్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తక్కువ విద్యుత్‌ వినియోగించుకొనే ఎల్ఈడీ బల్బుల వినియోగానికి ప్రజలను ప్రోత్సహించారు. అందుకోసం ఒక్కో విద్యుత్‌ కనెక్షన్‌పై కేవలం రూ.10 లకే ఒకటి చొప్పున రెండేసి బల్బులు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో విద్యుదీపాలను ఎల్ఈడీలకు మార్చారు. వీలైన చోట సోలార్ విద్యుత్‌ లైట్లు అమర్పింపజేశారు కూడా. తద్వారా రాష్ట్రానికి భారీగా విద్యుత్‌ భారం తగ్గింది.

నగరాలలో, పట్టణాలలో పరిశుభ్రత కోసం భారీగా అవుట్ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి వారితో రాత్రిపూట రోడ్లను శుభ్రపరిచే విధానాన్ని అమలుచేశారు. నేటికీ ఆ విధానం విజయవంతంగా అమలవుతోంది.

హూద్ హూద్ తుఫాను సమయంలో చంద్రబాబు నాయుడు విశాఖలో 10 రోజులు మకాం వేసి స్వయంగా అన్ని వ్యవస్థలను చక్కబెట్టించి తిరిగివెళ్ళారు. తుఫానులు, ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు పడిపోయి ప్రాణ నష్టం జరుగుతోందని గుర్తించినా చంద్రబాబు నాయుడు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్లు వేయించే పనులు ప్రారంభించారు.

టిడిపి అధికారంలో ఉన్నంతకాలం ఆ పనులన్నీ యుద్ధప్రాతిపదికన సాగాయి. కానీ ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే నాలుగేళ్ళుగా ఆ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. తిరుపతిలో అండర్ గ్రౌండ్‌ విద్యుద్దీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు నిలిచిపోయాయి.

ఈవిదంగా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ దూరదృష్టితో ఆలోచిస్తూ, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొంటూ రాష్ట్ర ప్రజలపై అదనపు భారం మోపకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తే, ఇప్పుడు ఇంటిపన్ను, ఖాళీ స్థలం పన్ను, చెత్తపన్ను వగైరాలు వసూలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోంది. కొన్ని జిల్లాలలో పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలకు కరెంటు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్‌ సిబ్బంది వచ్చి ఫ్యూజులు పీక్కొని పోతున్న వార్తలు బహుశః అందరూ చూసే ఉంటారు. అంటే లోపం ఎక్కడుంది?

ADVERTISEMENT
Latest Stories