రాజకీయాలలో రాగద్వేషాలు, భావోద్వేగాలకు స్థానం ఉండకూడదు అంటారు. కానీ వాస్తవంలో అవి ఆచరణ సాధ్యం కానివి అనేది అందరి రాజకీయ నాయకులకు ఎదో ఒక సందర్భంలో తెలిసోస్తుంది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయాలలో ఎప్పుడు హుందాగా, గంభీరంగా, సౌమ్యుడిగా పేరుపొందారు.
ఎంతటి సంక్షోభ సమయంలో అయినా అంతే నిబ్భరంగా వ్యవహరించి పరిస్థితులను చక్కపెట్టే నేర్పు బాబు సొంతం అని ఇతర రాజకీయ పార్టీల నేతలు సైతం ప్రశంసించేవారు. ఎన్టీఆర్ సమయంలో టీడీపీ పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని దీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు.రాళ్లు రప్పలతోనిండిపోయిన ప్రాంతం లో ఐటీ అంటూ బాబు గారి పాట్లేమిటి అంటూ వ్యంగ్యంగా విమర్శించిన రాజకీయ పార్టీలకు, నేతలకు తల వంచకుండా సైబరాబాద్ అనే మహా నగరాన్ని నిర్మించి తన చేతలతో ప్రత్యర్దుల నోటికి తాళం వేయగలిగారు.
2009 ఎన్నికలలో టీడీపీ పరాజయం పొందినప్పుడు అప్పటి అధికార ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తనను, తన తల్లిదండ్రులను అగౌరవపరిచిన అంతే హుందాగా ప్రభుత్వ పెద్దలకు సభలోనే సమాధానం చెప్పి, విమర్శలు చేసిన ప్రభుత్వ పెద్దలే తిరిగి ఆ విమర్శలను అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించేలా చేయగలిగారు.ఈ గొప్పతనం చంద్రబాబు ఒక్కడిదే కాదు తానూ చేసిన విమర్శలు తన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని భావించి వాటిని వెనక్కి తీసుకున్న నేతలది కూడా,అయితే అదంతా గతం.
కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం ఉన్న నేతలు కరువయ్యారనే చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకుల స్థాయి నానాటికి దిగజారిపోతూ వస్తుంది. ఒకరితో మొదలైన ఈ దుశ్చర్యలను అక్కడితో ఖండించకపోవడంతో ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంప్రదాయంగా మారిపోయింది. కొడాలి నానితో మొదలైన ఈ బూతుల రాజకీయాలు ఇప్పుడు అన్ని పార్టీలకు విస్తరించింది. “ముల్లును ముల్లుతోనే తీయాలి” అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఇదే పంధాను అనుసరిస్తున్నారు.
చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ను కించపరచడానికే ప్రజలు జగన్ కు 151 సీట్లు కట్టబెట్టారా? అన్నట్టుగా ఇంటా – బయట ఇక ఇదే పనిలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్ మొదలుకొని మరి కొందరు వైసీపీ నేతలు. బయట విమర్శించడానికి సిగ్గుపడే విమర్శలను సాక్ష్యాత్తు శాసన సభలోనే ముఖ్యమంత్రి సాక్షిగా కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కౌరవుల జూద సభను తలపించేలా చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో తన భావోద్వేగాలను ప్రజల ముందుకు తీసుకురాని చంద్రబాబు ఒక్కసారిగా అదుపు తప్పారు. నిండు శాసన సభలో తన కళ్ళముందే తన భార్యకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మొట్టమొదటి సారిగా చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. తోటి వాటి బాధను తమ వెకిలి చేష్టలతో, తమ దిగజారుడు విమర్శలతో ఏపీ రాజకీయాలను ఇంకాస్త దిగజార్చారు వైసీపీ నేతలు. తనకు తన భార్యకు అవమానం జరిగిన ఈ సభలో మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను అంటూ ఆనాడు బాబు చేసిన శబదం ఇప్పుడు లోకేష్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు.
అయితే తాజాగా లోకేష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీనికి కారణం కూడా వైసీపీ నేతలే అనుకోండి. మొట్టమొదటి సారిగా తన తండ్రి స్థానంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్న లోకేష్ పార్టీ నేతలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బాబు స్థానంలో నేను సభను నిర్వహించవలసి వస్తుందని తానూ ఎప్పుడు ఉపించలేదని దీనికంతటికి కారణం జగన్ చంద్రబాబు పై మోపిన అక్రమ కేసులే అన్నారు. కొందరు వైకాపా మంత్రులు తన తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సభలో గుర్తుచేసుకున్నారు లోకేష్.
చంద్రబాబుని చంపడానికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి బాబుకి పంపే భోజనంలో విషం కలుపుతారు అంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న విమర్శలు చూస్తుంటే బాధేస్తుంది అంటూ మరో సారి తన తల్లికి జరిగిన అవమానాన్ని ప్రజలకు వినిపించారు. జగన్ ఎటువంటి తప్పు చేయని తన తండ్రి జైలుకు పంపారు, రాజకీయాలతో సంబంధం లేని తన తల్లిని అవమానిస్తున్నారు అంటూ లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అప్పుడు చంద్రబాబుకి అవమానంతో కన్నీళ్లు, ఇప్పుడు లోకేష్ కు ఆక్రోశంతో కన్నీళ్లు, ఇద్దరి కన్నీళ్లకు కారకులు ఒక్కరే, అలాగే ఆ అవమాన భారాన్ని మోసే బాధితురాలు ఒక్కరే కావడం.




