టిడిపి యువనేత నారా లోకేష్ నేడు 119వ రోజున కడప శాసనసభ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పూర్తిచేశారు. మరో నాలుగు రోజులలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలో పాదయాత్ర పూర్తవుతుంది కనుక నేడు కడపలో ‘రాయలసీమ డిక్లరేషన్’ పేరుతో ప్రజలతో ముఖాముఖీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు వీడియో సందేశాల ద్వారా, నేరుగా నారా లోకేష్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే రాయలసీమ అభివృద్ధికి ఏమి చేస్తుందనే వారి ప్రశ్నలకు నారా లోకేష్ చాలా సాధికారంగా, వివరంగా, వినయంగా సమాధానాలు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకొంది.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
రాయలసీమ జిల్లాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల కష్టానష్టాలను, వారి సమస్యలను, వారి అవసరాలను, వారు అనుభవిస్తున్న బాధలను అన్నిటినీ చాలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మనసులో చాలా బాధ కలిగిందని నారా లోకేష్ అన్నారు. అందుకే నేడు ‘రాయలసీమ డిక్లరేషన్’ పేరుతో సీమ కష్టాలు తీర్చేందుకు టిడిపి ఏమి చేయబోతోందో సమగ్ర ప్రణాళికను ప్రజల ముందుంచుతున్నానని నారా లోకేష్ అన్నారు.
రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానంగా త్రాగు,సాగు నీటి కొరత, నిరుద్యోగ సమస్య, మౌలిక వసతుల లేమిని తాను గమనించానని నారా లోకేష్ అన్నారు. కనుక రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే రాయలసీమ జిల్లాలో పెండింగులో ఉన్న త్రాగు, సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే బాధ్యత తాను తీసుకొంటానని చెప్పారు. సీమలో ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
Also Read – ఏ.ఆర్. రెహమాన్‌కు 2 కోట్ల జరిమానా!
రాయలసీమకు నీటి వసతి ఉంటే ఇక్కడ రైతులు బంగారం పండిస్తారని కానీ జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా రైతులను మోసం చేసిందని అన్నారు. పైగా మోటర్లకు మీటర్లు పెట్టుకోవాలని రైతులను ఒత్తిడి చేస్తుందత్తం చాలా దుర్మార్గమని అన్నారు.
రాయలసీమలో బొప్పాయి, మామిడి, దానిమ్మ తదితర పండ్లతోటలకు మంచి అనువైన భూమి, వాతావరణం ఉంది కనుక వాటి సాగుకు మళ్ళీ90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థని అందిస్తామని చెప్పారు. రాయలసీమలో విస్తారంగా టొమోటో పండిస్తారు కనుక ఇటువంటి పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు కూడా నెలకొల్పుతామని చెప్పారు.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
విత్తనాల ఉత్పత్తి, కొత్త రకం పంటల సాగుకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమలో రైతు బజార్ల సంఖ్య పెంచి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకొనే సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రైతులకు మేలు కలిగించే సంక్షేమ పధకాలను తీసుకువస్తామని చెప్పారు. ఇప్పటికే ఏడాదికి రూ.20 వేలు ఆర్ధికసాయం అందించబోతున్నట్లు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతిని నారా లోకేష్ వారికి గుర్తు చేశారు.
వ్యవసాయంతో పాటు సీమా జిల్లాలలో పాడి పశువులు, కోళ్ళు, గొర్రెలు, మేకలను ఉచితంగా పంపిణీ చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పశువుల దాణా ఉత్పత్తి, పాలు, పెరుగు వగైరా డెయిరీ ఉత్పత్తులు, మాంసం విక్రయాలకి వేరేగా కార్యక్రమాలు చేపడతామని నారా లోకేష్ చెప్పారు.
టిడిపి హయాంలో రాయలసీమ జిల్లాలకు అనేక పరిశ్రమలను తీసుకువచ్చినప్పటికీ, వైసీపీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్ళకు భయపడి పలు కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని, ఆ కారణంగానే సీమ జిల్లాలో నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు.
రాయలసీమలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగుల మందులు, యంత్ర పరికరాలు తయారుచేసే పరిశ్రమలను సీమా జిల్లాలోనే ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా శిక్షణ కూడా ఇప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. సీమ జిల్లాలకు ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలను కూడా తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని, దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకొంటానని నారా లోకేష్ అన్నారు.
రాయలసీమలో విద్యా, వైద్యం, మౌలికవసతుల కల్పనతో పాటు క్రీడారంగంలో యువతను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని నారా లోకేష్ అన్నారు. రాయలసీమను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నేనే తీసుకొంటాను. ఒకవేళ ఇప్పుడు ఇస్తున్న హామీలను నెరవేర్చలేకపోతే మళ్ళీ ఎన్నికలకు వచ్చినప్పుడు నన్ను నిలదీసి అడగండి,” అని నారా లోకేష్ అన్నారు.
నిజానికి ఆనాడు సమైక్యాంద్రా నుంచి ఇప్పటి ఆంధ్రా వరకు రాష్ట్రాన్ని రాయలసీమ నేతలే పరిపాలిస్తున్నారు. అయినా రాయలసీమలో ఇంత వెనకబాటుతనం ఉండటం చాలా బాధాకరం.
నారా లోకేష్ స్వయంగా ఇవన్నీ కళ్ళారా చూశారు కనుక రాయలసీమని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్దమవుతోంది. నారా లోకేష్ మాటలలో నిజాయితీ కనిపిస్తోందని, ఆయన తప్పకుండా సీమ కష్టాలు తీరుస్తారని సీమవాసులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన పాదయాత్రకు ఇంతగా ప్రజాధారణ వస్తోంది.