అధికారంలోకి వచ్చాక మాయమాటలు చెపుతూ, ప్రతిపక్షాలను, కేంద్రాన్ని నిందిస్తూ హాయిగా 5 ఏళ్ళు కాలక్షేపం చేసేయవచ్చు. ఎన్నికల వరకు ఎవరూ ఏమీ చేయలేరు కూడా. అలా చేసిన పార్టీలను ప్రజలే గద్దె దించేస్తుంటారు.
గత ప్రభుత్వం హయంలో గుడివాడ అమర్నాద్‌కి ఐటి, పరిశ్రమల శాఖ వంటి కీలకశాఖ, దాంతో తన సామర్ధ్యం నిరూపించుకో గల గొప్ప అవకాశం లభించింది. కానీ పదవిలో ఉన్నప్పుడే కాదు… దిగిపోయిన తర్వాత కూడా ఆయన ‘కోడి-గుడ్డు మంత్రి’ గానే మిగిలిపోయారు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ కూడా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాల గురించి మాట్లాడింది చాలా తక్కువ. ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను ఎద్దేవా చేస్తూ కాలక్షేపం చేస్తుండేవారు.
కానీ ఇప్పుడు ఐటి శాఖని చేపట్టిన నారా లోకేష్ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఢిల్లీ, ముంబాయి తదితర నగరాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెప్పిస్తున్నారు.
ఈరోజు విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడిన మాటలలో పరిపక్వత, సామర్ధ్యం, తెలివితేటలు, దూరదృష్టి చాలా స్పష్టంగా కనపడతాయి.
వైసీపీ ప్రభుత్వంపై అయన చేసిన విమర్శలను పక్కన పెడితే, “ఈ 16 నెలల్లోనే అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు విశాఖ జిల్లాకు వచ్చాయి. రాబోయే 5 ఏళ్ళలో మరిన్ని రాబోతున్నాయి. కనుక రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు పెరిగితే జనాభా, వాహనాలు, రద్దీ అన్నీ పెరుగుతాయి. అప్పుడు రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించడం మొదలుపెట్టడం కాదు… ఇప్పుడే ఆ పనులు మొదలుపెట్టి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ వచ్చే సమయానికి విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో సకల మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించాము. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా ఇప్పటి నుంచే అన్నీ నిర్మించుకొని మనం సిద్ధంగా ఉండాలి.
ఈ అభివృద్ది కేవలం విశాఖ నగరం వరకే పరిమితం కాదు. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా సమాంతరంగా శరవేగంగా అభివృద్ధి చెందబోతున్నాయి. ఈరోజు నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యి ఉత్తరాంధ్ర జిల్లాల మౌలిక వసతుల అభివృద్ధికి ఏమేమి చేయాలో చర్చించబోతున్నాను.
జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరి సూచనలతో ఓ సమగ్ర ప్రణాళిక సిద్దం చేసుకొని ఆ ప్రకారంగా అభివృద్ధి పనులు మొదలుపెట్టబోతున్నాము. ఓ పక్క ఈ పనులు చేస్తూనే పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఏవిదంగా గుండెకాయవంటిదో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరం ఆర్ధిక, పారిశ్రామిక, ఐటి రాజధానిగా మారబోతోంది,” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
మంత్రి నారా లోకేష్ మాటలకు మళ్ళీ వివరణ అవసరమా? అవసరం లేదు!




