ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోతే ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను తమ గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలను శాశిస్తుంటుంది. అటు ఈశాన్య రాష్ట్రాలలో, ఇటు దక్షిణాదిన తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇదే ఫార్ములా అమలుచేస్తోంది.
అయితే ఈ ఫార్ములాతో ప్రాంతీయ పార్టీలను, రాష్ట్ర రాజకీయాలను శాశించగలుగుతోంది కానీ రాజకీయంగా ఎదగలేకపోతోంది. బీజేపీ చేస్తున్న రాజకీయాల పట్ల ఆయా రాష్ట్రాలలో ప్రజలు ఆగ్రహంగా ఉండటమే ఇందుకు కారణం.
ఏపీ విషయానికే వస్తే, జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పుకొంటుంది. కానీ వైసీపితో అంటకాగుతుంటుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడుని, టిడిపిని కట్టడి చేయగలిగితే, వైసీపి లాభపడుతుందని తెలుసు. బహుశః అందుకే మోడీ, అమిత్ షాలు మౌనం వహిస్తుండవచ్చు. వారు మౌనం వహించడం ద్వారా వైసీపికి మేలు చేస్తున్నారు కనుక ఆ పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకోగలుగుతున్నారు.
ఈ కేసులలో నుంచి చంద్రబాబు నాయుడుకి విముక్తి పొందడం కోసం టిడిపి తమ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూసేలా చేస్తూ ఆ పార్టీని కూడా తమ కనుసన్నలలో పెట్టుకొన్నారు.
టిడిపిని బలహీనపరిస్తే జనసేన తమను అంటిపెట్టుకొని ఉంటుందని బీజేపీ అధిష్టానం ఊహించి ఉండవచ్చు. కానీ మోడీ, అమిత్ షాల తీరుతో విసుగెత్తిపోయిన పవన్ కళ్యాణ్, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేశానని, టిడిపితోనే కలిసి ఎన్నికలకు వెళతామని కుండ బద్దలు కొట్టేశారు.
బీజేపీ అధిష్టానం వైఖరి కారణంగా ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏ విషయంలోనూ జవాబు చెప్పుకోలేని దుస్థితిలో ఉంది. చివరికి జనసేనతో పొత్తుల విషయంలో కూడా ‘అంతా ఢిల్లీలోనే’ అని చెప్పుకొంటోంది. ఏపీలో బీజేపీ బలపడి సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకొంటున్నట్లయితే బీజేపీ అధిష్టానం ఈవిదంగా వ్యవహరించకూడదని అర్దమవుతూనే ఉంది.
తెలంగాణ విషయంలో కూడా బీజేపీ అధిష్టానం ఇదే విదంగా వ్యవహరిస్తూ తెలంగాణ బీజేపీ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చేసింది. కల్వకుంట్ల కవిత విషయంలో హటాత్తుగా వెనక్కు తగ్గడం, ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేయడం ద్వారా బిఆర్ఎస్ పార్టీతో రహస్య అవగాహన ఉందని ప్రజలు అనుమానించేలా చేసుకొంది. లేదని నిరూపించడానికి ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్ పర్యటనలో కేసీఆర్‌ని విమర్శించడం, ఆ రాష్ట్రానికి పసుపుబోర్డు ప్రకటించడం ఇందుకు తాజా నిదర్శనాలు.
ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రాల రాజకీయాలను శాశించాలనే బీజేపీ అధిష్టానం ధోరణితో రాష్ట్ర బీజేపీలను నిర్వీర్యం చేస్తోందని చెప్పక తప్పదు. రాష్ట్రాలలో బీజేపీ బలపడేందుకు అధిష్టానం తోడ్పడాలి కానీ వాటి విశ్వసనీయతను, ఉనికిని ఎందుకు ప్రశ్నార్దకంగా మారుస్తోంది? అనే సందేహం కలుగుతుంది. రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కంటే ఆయా రాష్ట్రాలలో ఎంపీ సీట్లే ముఖ్యమని బీజేపీ అధిష్టానం భావిస్తుండటమే ఇందుకు కారణం అయ్యుండవచ్చు.
కనుక ఏపీలోని 25 ఎంపీ సీట్లే ముఖ్యం తప్ప ఏపీ, దాని అభివృద్ధి, ఏపీ ప్రజలు, వారి ఆకాంక్షలు, మనోభావాలు ముఖ్యం కాదని భావిస్తున్నట్లుంది. బీజేపీ అధిష్టానం యొక్క ఈ ధోరణి ఏపీకే కాదు ఏపీ బీజేపీకి కూడా శాపం కాదా?





