బీజేపీ హిందుత్వ అజెండాతోనే రాజకీయాలు చేస్తుందని అందరికీ తెలుసు. ఒక్కో పార్టీ ఒక్కో విధానంతో ప్రజలను ఆకట్టుకుని ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంటాయి.
ఉదాహరణకు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’, మజ్లీస్ ముస్లింలు ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తుంటాయి. ఏపీలో దాదాపు అన్ని పార్టీలు ఎక్కువగా కుల రాజకీయాలను నమ్ముకుంటాయి. ఇదేవిదంగా బీజేపీ కూడా హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేస్తుంటుంది.
దేశంలో హిందూ జనాభా ఎక్కువ కనుక వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంటుంది. ఇది బీజేపీ ఎంచుకున్న విధానం. దీనిని తప్పు పట్టలేము. కానీ లౌకిక వాదానికి పేటెంట్ హక్కులు తీసుకున్నట్లు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, కుహనా లౌకిక వాదులు తప్పు పడుతుంటారు.
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట పేరుతో బీజేపీ దేశంలో హైప్ సృష్టిస్తూ లోక్‌సభ ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి. ఇది నిజం కూడా. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో జరుగుతున్న హడావుడితో దేశంలో హిందూ ఓటర్లలో మెజార్టీ శాతం ప్రభావితులవుతారు. కనుక వారు బీజేపీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది.
అందుకే లోక్‌సభ ఎన్నికల వరకు కేంద్ర ప్రభుత్వం (బీజేపీ) అయోధ్యలో ఈ హడావుడిని కొనసాగిస్తూ ఇంకా ఇంకా పెంచుతుందని కాంగ్రెస్, మిత్రపక్షాలు వాదిస్తున్నాయి.
అయోధ్యలో రామాలయం నిర్మించడం, శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట తదితర కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆధ్యాత్మిక వ్యవహారాలు కాగా, బీజేపీ వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మిత్ర పక్షాలు వాదిస్తున్నాయి.
బీజేపీ అవునన్నా కాదన్నా అది ఆశిస్తున్నదీ… జరుగబోయేది ఇదే! కనుక కాంగ్రెస్ వాదనలను ఖండించలేము. అలాగని బీజేపీ హిందుత్వ విధానాన్ని కూడా తప్పు పట్టలేము.
దేశంలో మెజార్టీ జనాభా హిందువులే ఉన్నప్పుడు వారి ఆకాంక్షలు, అభిమతం, వారి మత విశ్వాసాలను, మనోభావాలను గౌరవించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ భావిస్తోందా?అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో ముస్లిం ఓటు బ్యాంకుని కాపాడుకోవడానికే పరిమితం అవుతోందని వాదించారు. ఇప్పుడు అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవానికి మొహం చాటేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న మసీదు ప్రారంభోత్సవానికి కూడా లౌకిక వాదులమని చెప్పి మొహం చాటేయగలరా?అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. లౌకికవాదం అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించడం కాదనే కిషన్ రెడ్డి వాదనలను కాంగ్రెస్ పార్టీ కాదనగలదా?
కనుక కాంగ్రెస్ లౌకికవాదం, బీజేపీ హిందూవాదం రెండూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అని చెప్పక్కరలేదు. అవి అయోధ్య విషయంలో పరస్పరం విమర్శించుకోవడం నిందించుకోవడం కూడా అందుకే కదా!




