నవంబర్ 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. మరో రెండు మూడు నెలల తర్వాత ఏపీలో జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగానే ఉంది. బీజేపీ కూడా బలంగానే ఉంది. బిఆర్ఎస్ పార్టీ ఈ రెంటి కంటే ఇంకా బలంగా ఉంది.
తెలంగాణ ప్రజలు తమకే ఎందుకు ఓట్లు వేసి మళ్ళీ గెలిపించాలో బిఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగానే చెపుతోంది. ఈ పదేళ్ళలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిని చూసి, రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతున్న సంక్షేమ పధకాలను చూసి తమకు ఓట్లు వేయమని బిఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. కనుక ప్రజలను ఓట్లు అడిగేందుకు దానికి బలమైన కారణం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములు ప్రకటించి వాటిని అమలుచేస్తామని చెపుతోంది. ముఖ్యంగా ప్రభుత్వోగ్యాల భర్తీ చేస్తామని చెపుతోంది. బీజేపీ ఇంకా మానిఫెస్టో ప్రకటించలేదు కనుక కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, మజ్లీస్ పార్టీతో దోస్తీపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ (కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ) వస్తే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇస్తోంది. అయితే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు, అవార్డులే చెపుతునందున బీజేపీ కొత్తగా ఏమైనా చెప్పుకోలేక మోడీ భజనతో కాలక్షేపం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. కనుక దాని గురించి చర్చ అనవసరం. ఇక ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, చంద్రబాబు నాయుడు అరెస్టుపై మౌనం వంటి అనేక కారణాల వలన ఏపీ ప్రజలు బీజేపీ పట్ల అసహనంతో ఉన్నారు. ఈవిషయం ఏపీ బీజేపీకి తెలుసు. కానీ ఏమీ చేయలేని దుస్థితి.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి లక్షల కోట్లు నిధులు ఇచ్చిందని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొంటున్నప్పటికీ, వాటన్నిటిపై జగన్ ముద్ర వేసేసుకొంటోంది. కనుక వాటి గురించి బీజేపీ గట్టిగా చెప్పుకోలేదు. చెప్పినా ప్రజలు నమ్మరు. జనసేనతో బీజేపీకి పొత్తులు ఉన్నాయని చెప్పుకోలేకపోతోంది. అలాగని వైసీపితో చేతులు కలపలేకపోతోంది. కనుక ఏపీలో కూడా మోడీ భజనతో కాలక్షేపం చేయాల్సిందే. మోడీ భజనకు ఉత్తరాది ప్రజలు పరవశించిపోతారేమో కానీ దక్షిణాది ప్రజలు మాత్రం దానిని డబ్బింగ్ సినిమాగానే చూస్తుంటారు.
కనుక బీజేపీ దక్షిణాది రాష్ట్రాలలో అడుగుపెట్టాలంటే దక్షిణాదికే ప్రత్యేకమైన విధానం రూపొందించుకోవాలి తప్ప పాన్ ఇండియా మూవీ చూపిస్తామంటే కుదరదు.






