ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అంటున్న నరేంద్ర మోడీ సర్కారుతో యుద్ధం చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంసిద్దమవుతున్నట్లు సమాచారం. ఇచ్చిన హామీ కంటే అధికంగానే నిధులిచ్చినా, ప్రత్యేక హోదా ఇంకెందుకంటూ ఓ వైపు బీజేపీ సర్కారు వాదిస్తుంటే… ఆ వాదనలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పలు కీలక శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు, ఈ సందర్భంగా నిధుల కేటాయింపులో పొరుగు రాష్ట్రాల కంటే ఏపీని కేంద్రం హీనంగా చూస్తున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎదురుగా పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రం, సుస్సంపన్నమైన రాష్ట్రం తెలంగాణాతో పోలుస్తూ గణాంకాలు బయటకు తీసినట్లుగా తెలుస్తోంది.
కరువు నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణలోని 7 జిల్లాలకే 791 కోట్లు కేటాయించిన కేంద్రం… ఏపీలోని 10 జిల్లాలకు కేవలం 433 కోట్లు మాత్రమే విడుదల చేసిన వైనాన్ని చంద్రబాబు వెలికితీశారు. కేంద్రం వ్యవహరించిన ఈ వైఖరిని ప్రధాని ముందు పెట్టి, కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా లెక్కలు తీస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదాపై ఇటీవల బిజెపి నేతలు చేసిన అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు కనపడుతోంది.



