గడిచిన మూడేళ్ళ పాలనలో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలందరినీ షాక్ కు గురి చేసారు. అందులో ఒకటి… గతేడాది నవంబర్ లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కాగా, మరొకటి… జీఎస్టీ అమలు చేయడం. ఈ రెండు నిర్ణయాల వలన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడే చెప్పడం కష్టం గానీ, తాత్కాలికంగా మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ కరెన్సీ రూపంలో కనపడుతుండగా, జీఎస్టీ ఏంటో అర్ధం కాని వారు కోకొల్లలు.
మోడీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు ముఖ్యంగా వ్యాపారులను బలిగొన్నాయని చెప్పవచ్చు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కుదేలైన వ్యాపార రంగం ఇప్పటికీ ఓ దారికి రాకపోగా, తాజాగా అమలు చేసిన జీఎస్టీ వలన అది మరింత పాతాళానికి పడిపోయింది. అయితే ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొన్నా, దేశ భవిష్యత్తుకు ఈ రెండు నిర్ణయాలు సానుకూలంగా మారతాయన్న ఆశతో ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మరి ఈ రెండు సంచలన నిర్ణయాల తర్వాత మోడీ తదుపరి ‘అడుగు’ ఎవరిపై ఉండబోతోంది?
సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ఓ అంశంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ‘ఒకే దేశం – ఒకే పన్ను’ తరహాలో ‘ఒకే దేశం – ఒకే కులం’ అన్న రీతిలో ప్రస్తుతం సమాజంలో ఉన్న రిజర్వేషన్లన్నింటినీ ఎత్తివేయాలని అభిలాషిస్తున్నారు. ఊహలకు ఇది సాధ్యం కాదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే గానీ, డిమాండ్ అయితే భారీ స్థాయిలోనే ఉంది. అయితే రిజర్వేషన్ల పరిస్థితి ఎలా ఉన్నా, ముందుగా రాజకీయ ప్రక్షాళన దిశగా మోడీ తదుపరి కార్యాచరణ ఉండబోతోందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ పార్టీలలో వణుకు పుట్టించే నిర్ణయంతో మోడీ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పార్టీలకు వచ్చే విరాళాలను ప్రక్షాళన చేయడమే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రధానమైన అంశంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం వెనుక ఆంతర్యం కూడా ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంతో రాజకీయ పార్టీలు కుదేలు కావడం ఖాయమని అరుణ్ జైట్లీ చెప్పడంతో, మోడీ తదుపరి అస్త్రం ఇదేనని తెలుస్తోంది.
పార్టీల విరాళాల అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ చెప్తున్నారని, త్వరలో రాబోయే ఈ విధానం వలన మొత్తం రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని అరుణ్ జైట్లీ తెలిపారు. విరాళాలు నగదు రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకోవాలంటూ ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో జైట్లీ తెలుపగా, బహుశా ఇదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటివరకు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన మోడీ నిర్ణయాలు, తొలిసారిగా రాజకీయ పార్టీలకు తగలనున్నాయనేది విశ్లేషకుల మాట.



