ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభ ఎన్నికల వేళ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేదల జీవితాలను బాగు చేయడానికి ఎంతైనా ఖర్చు చేసే అధికారం తనకు ఉంది కానీ ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాలు ప్రకటించి ఖజానా ఖాళీ చేసే అధికారం తనకు లేదన్నారు. ఇదేవిదంగా సాగిన కొన్ని దేశాల పరిస్థితి ఏవిదంగా అందరం చూశామన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని ప్రస్తావిస్తూ, “మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే మెట్రో రైళ్ళ పరిస్థితి ఏమిటి? బస్సు ప్రయాణం ఉచితం కనుక మహిళలందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తారు తప్ప మెట్రో రైళ్ళు ఎక్కరు కదా?అప్పుడు వేలకోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న మెట్రోలు నష్టపోతాయి కదా?కనుక ఈ రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు ఈ ఉచితాలు ఇచ్చే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది,” అని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీలలో ఈ మహాలక్ష్మీ పధకం కూడా ఒకటి. దానిలో భాగంగా రాష్ట్రంలో మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.
కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి రాజకీయ విరోధం ఉంది కనుక ప్రధాని మోడీ ఈవిదంగా అని ఉండవచ్చు లేదా ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాలు ప్రకటించి ఖజానా ఖాళీ చేయడం సరికాదని ఆయన భావిస్తుండవచ్చు.
అయితే ఏపీలో టిడిపి కూడా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మ్యానిఫెస్టోలో హమీ ఇచ్చింది కదా?ఆ పార్టీతోనే బీజేపీ పొత్తుపెట్టుకొని ఎన్నికలలో పోటీ చేసింది కూడా.
కనుక రేపు ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీలు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు అమలుచేసే మొట్ట మొదటి పధకం ఇదే కావచ్చు. కానీ ఈ పధకం సరికాదని ప్రధాని మోడీ భావిస్తునందున అప్పుడు వద్దని చెపుతారా?లేక ఈ పధకం అమలుచేస్తే, ఏపీలో మెట్రో రైలు ఏర్పాటుకి అనుమతించమని చెప్తారా?
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ హైదరాబాద్ మెట్రో కిటకిటలాడుతూనే ఉంది. నగరంలో అన్ని మార్గాలలో కలిపి ప్రస్తుతం రోజుకి 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కనుక ఈ పధకం వలన మెట్రో మనుగడకి ఎటువంటి ఇబ్బందీ లేదని స్పష్టమవుతోంది.
కానీ ఈ మహాలక్ష్మీ పధకం వలన టిఎస్‌ఆర్టీసీ క్రమంగా మునిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ పధకం భారం పడుతుండటంతో నిధులు సర్ధుబాటు చేసుకోలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ప్రధాని నరేంద్రమోడీ ఏ ఉద్దేశ్యంతో ఈ మాట అన్నా రాజకీయ పార్టీల హామీలు, ఉచితాలు, సంక్షేమ పధకాల భారంతో రాష్ట్రాలు అప్పులపాలు అవుతున్నాయనేది వాస్తవం. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉచితభారాన్ని మళ్ళీ ప్రజలపైనే మోపుతుండటంతో వారూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ప్రధాని నరేంద్రమోడీకి తెలియదనుకోలేము.
కనుక ఈ ఎన్నికల హామీలకు ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. మోడీ మళ్ళీ ప్రధానిగా బాధ్యత చేపడితే అడ్డుకట్ట వేస్తారా? అంటే వేయరని తెలుసు. కనుక ఆచరించని వాటి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా ప్రయోజనం ఉండదు.




