దేశంలో నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నరేంద్ర మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 3 లక్షలు మించి జరిగే నగదు లావాదేవీలను నిషేధించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం బ్లాక్ మనీపై సమీక్షించి సిఫార్సులు చేయగా, తాజాగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. అయితే ఈ ప్రతిపాదనలపై వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమ రంగాల్లో 15 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం అమలులో ఉండగా, దీన్ని 3 లక్షలకు తగ్గిస్తే ఆదాయపు పన్ను అధికారుల నుంచి వేధింపులు పెరుగుతాయని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. నగదు లావాదేవీలన్నీ క్రెడిట్, డెబిట్ కార్డులు, చెక్కులు, డీడీల రూపంలోనే జరపాలన్న లక్ష్యంతోనే 3 లక్షల పరిమితి విధించాలని సిట్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.
ఈ తరహా చెల్లింపులైతే వెంటనే వాటిని ట్రాక్ చేసే వీలు ఇన్ కం టాక్స్ అధికారులకు సులువవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 3 లక్షలు అతి తక్కువ మొత్తమని వ్యాపారులు వాపోతున్నారు. సాధారణ వ్యక్తులకు ఇంత మొత్తాన్ని పరిమితం చేస్తే ఉపయోగం ఉంటుందేమో గానీ, వాణిజ్య రంగానికి అనుసంధానించే విధంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవన్నది నిపుణుల మాట.



