త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఈసారి ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందా లేక పదేళ్ళ మోడీ/బీజేపీ పాలన పట్ల సహజంగా ఏర్పడే ప్రజావ్యతిరేకత వలన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్న వినబడుతోంది.
దేశంలోని వాస్తవిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనించినట్లయితే, మోడీ, అమిత్ షాల నాయకత్వంలో దేశంలో బీజేపీ చాలా బలపడిందని అర్దమవుతుంది. కానీ ఇదే సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేయలేని దుస్థితికి చేరుకొంది.
ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నప్పటికీ దానిలో భాగస్వామ్య పార్టీలతో అదో పెద్ద కప్పల తక్కెడగా మారింది. ఇండియా కూటమి ఐక్యత ఏపాటిదో తెలుసుకోవాలంటే ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తే చాలు. ఒకేసారి విచ్ఛిన్నం అయిపోతుంది!
కాంగ్రెస్‌తో కలిసి 27 పార్టీలు అట్టహాసంగా ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత వాటిలో అదే ఐక్యత, స్పూర్తి కొరవడంతో కూటమి సమావేశాలకు హాజరుకాకుండా మొహం చాటేస్తున్నాయి. పేరుకి ఇండియా కూటమే కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే పెత్తనం చలాయిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోపక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఆయన కూడా ఇండియా కూటమి మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదని అర్దమవుతోంది.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కానీ, ఇండియా కూటగానీ ఎన్డీయే కూటమికి గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందున, బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వలన, దేశ ప్రజలకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదే మళ్ళీ బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని గెలిపించి అధికారం కట్టబెట్టడం!
అయితే పదేళ్ళ మోడీ పాలన పట్ల దేశ ప్రజలలో సహజంగా ఏర్పడే వ్యతిరేకత వలన ఈసారి బీజేపీకి కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లోటుని భర్తీ చేసేందుకు వైసీపి, టిడిపి, జనసేన, బిఆర్ఎస్, అన్నాడిఎంకె, బిజెడీ వంటి పార్టీలు సిద్దంగా ఉన్నాయి.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ తప్పులు సరిదిద్దుకోవడానికి, కొత్త ఆలోచనలతో పార్టీని పునర్నిర్మించుకుని బలపడటానికి ఒకటీ రెండూ కాదు 5 ఏళ్ళ సమయం లభించింది. కానీ కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఎప్పటిలాగే ఇండియా కూటమి అనే కప్పల తక్కెడ పట్టుకొని లోక్‌సభ ఎన్నికలకు బయలుదేరుతోంది. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన, పనితీరు, నేతలు మారనంత వరకు బీజేపీకి ఢోకా లేదనే చెపొచ్చు.




