ప్రధాని నరేంద్రమోడీ నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా ఈరోజు ఉదయం లేపాక్షి ఆలయంలో శ్రీ వీరభద్రస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రం చేరుకొని అక్కడ ఇండియన్ రెవెన్యూ సర్వీసస్ (ఐఆర్ఎస్) అధికారుల శిక్షణ కొరకు కొత్తగా నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్) శిక్షణా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు.
రూ.720 కోట్ల వ్యయంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇది ఏర్పాటైంది. పాలసముద్రం సమీపంలో 503 ఎకరాలలో దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో సకల సౌకర్యాలతో నిర్మించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల చొరవతో 2015 ఏప్రిల్ నెలలోదీనికి శంఖుస్థాపన జరిగింది. ఈరోజు దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, స్థానిక వైసీపి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
వచ్చే నెలాఖరులోగా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టిడిపితో పొత్తు పెట్టుకొని ముందుకు సాగిపోతోంది. కానీ రాష్ట్రంలో పొత్తుల గురించి బీజేపీ పెద్దలు ఇంతవరకు ఏపీ బీజేపీకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. కనుక దాని పరిస్థితి చాలా అయోమయంగా మారింది.
ఈ నేపధ్యంలో నేడు ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి వచ్చారు. కనుక పొత్తుల గురించి ఏమైనా సంకేతం ఇస్తారో లేదో? ఇది అధికారిక పర్యటన… ఈ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్రమోడీ వెంట జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు. కనుక ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలు మాట్లాడకపోవచ్చు.
ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం మామూలే. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికే కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పదేపదే చెపుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నోట కనీసం ఆ ఒక్కమాట అయినా వినిపిస్తుందో లేదో?
ఒకవేళ ఇప్పుడు చెప్పకపోయినా ఎన్నికలు సమీపిస్తున్నందున త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు ఆంధ్రా పర్యటనలకు వస్తారు. కనుక అప్పుడు ఏపీ రాజకీయాల పట్ల తమ పార్టీ వైఖరి ఏమిటో ఎలాగూ చెప్పక తప్పదు.




