పాపం నాని!

పాపం నాని!ఇండస్ట్రీ మంచి కోసం నాని చేసిన వ్యాఖ్యలు తిరిగి చివరికి ఆయనకే బూమ్ రాంగ్ అయ్యే విధంగా పరిస్థితులను వైసీపీ విజయవంతంగా తీసుకువచ్చింది. నాడు సినిమా హాల్ ను – కిరాణా కొట్టు కలెక్షన్స్ ను పోల్చుతూ టికెట్ ధరలపై తన గళాన్ని విప్పిన నాచురల్ స్టార్ నానికి, ఇపుడు సెటైర్లు, కౌంటర్లు పడుతున్నాయి.

కిరాణా కొట్టు కలెక్షన్స్ బాగుంటే వాటినే పెట్టుకోవచ్చు కదా అంటూ వైసీపీ మంత్రి కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసారో, ఏ కొట్టు కలెక్షన్స్ నాని దృష్టికి వచ్చాయో తనకు తెలియదని తాజాగా మరో మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నానిలు కలిసి హీరో నానిపై ఓ విధంగా ఎదురుదాడికి దిగారు.

ADVERTISEMENT

అయితే హీరో నాని మాత్రం గమ్మునుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీ నుండి ఏ వ్యక్తి ఈ అంశాలపై మాట్లాడవద్దని దిల్ రాజు స్పష్టం చేయడంతో, వీటికి నాని ఏ రకంగానూ బదులు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. సోమవారం నాడు ‘శ్యామ్ సింగ రాయ్’ వేడుకలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో నాని నుండి మైక్ కూడా దిల్ రాజు తీసేసుకున్న వైనం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి సమస్యలను మరింత జఠిలతరం చేయడం ఇష్టం లేకనే దిల్ రాజు ‘ఇకపై ఎవరూ మాట్లాడవద్దని’ చెప్పి ఉండవచ్చు. అంటే దీని ఉద్దేశం… బాణాలు ఒక వైపు నుండే వస్తుంటాయి, వాటిని సంతోషంతో “నాని అండ్ కో” స్వీకరించాలని, తాజాగా ఇద్దరు మంత్రుల నానిలు వ్యక్తం చేస్తోన్న విమర్శలతో అవగతం అవుతోన్న అంశం.

ఈ అంశంపై వరుస ట్వీట్స్ వేసి ప్రశ్నించిన మరో హీరో సిద్ధార్థ్ పై పేర్ని నాని కామెంట్ చేసారు. హీరో సిద్ధార్థ్ తమిళనాడులో ఉన్నాడు కాబట్టి బహుశా అక్కడ సీఎం స్టాలిన్ ను, అక్కడ మంత్రులను ఉద్దేశించి మాట్లాడరేమో లేక మోడీ గురించి అన్నారేమో, ఈ రాష్ట్రంతో ఆయనకేం సంబంధం? మేం ఏ రకంగా బతుకుతున్నామో సిద్ధార్థ్ కు ఏం తెలుసు? అంటూ సెటైర్లు వేశారు.

ADVERTISEMENT
Latest Stories