ఆంధ్రప్రదేశ్ కు ఆయువుపట్టు వంటి పోలవరం ప్రాజెక్టులో నవయుగం మొదలుకాబోతుందా? అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. నిన్న కేంద్రంతో జరిగిన చర్చలలో నిధుల ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. మరోవైపు ప్రాజెక్టు పనుల్లో నవయుగ శుక్రవారం భాగస్వామి అయ్యింది.
ఆ కంపెనీ ప్రతినిధులు భూమిపూజ నిర్వహించి ప్రస్తుత కాంట్రాక్టర్ నుండి కొన్ని యంత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నవయుగ రావడంతో కొత్త యంత్రాలు, అదనపుడు సిబ్బంది, కార్మికులు అందుబాటులోకి రాబోతున్నారు. దీనితో ప్రాజెక్టు పనులు వేగం అందుకోబోతున్నాయి. ప్రస్తుత కాంట్రాక్టర్ పనులు సకాలంలో చెయ్యడంతో విఫలం అవ్వడంతో చంద్రబాబు కేంద్రంతో పోరాడి కొత్త కంపెనీని తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడైన పోలవరాన్ని 2019 నాటికి పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. 1400 కోట్ల వ్యయంతో స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను నవయుగ చేపట్టనుంది. కాంక్రీటు పనుల కోసం ఇరవై వేల మంది కార్మికులను రంగంలోకి దించి రాత్రి పగలు పనులు చేపట్టబోతున్నట్టు నవయుగ ప్రకటించింది.



